ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: తెలం గాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా పాలసీలో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెక్లెస్ రోడ్‌లో ఆధునిక పద్ధతుల్లో నీరా కేఫ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఎన్నో బాలారిష్టాలను దాటు కుని ఆగస్టులో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ ఎస్‌ఏఐ) ఇప్పటికే అనుమతి మంజూరు చేయడంతో పనులు చకచకా సాగుతున్నాయి. తెలంగాణలోని సంప్రదాయ కులవృత్తుల్లో ఎన్నో ఆధునిక పద్ధతులు వస్తున్నా, కల్లు గీత వృత్తి మాత్రం ఇంకా సాంప్రదాయబద్ధంగానే సాగుతోంది. పట్టణాల నుంచి మొదలుకొని గ్రామాల వరకు లిక్కర్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత గీత కార్మికులు ఉత్పత్తి చేసే తాటి, ఈత కల్లుకు డిమాండ్ తగ్గింది. దానికి తోడు ఈ వృత్తి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో నేటితరం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కులవృత్తులకు పూర్వవై భవం తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే నీరా పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్‌గా నెక్లెస్ రోడ్‌లో రూ.10 కోట్లతో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఒకేసారి 200మందికి పైగా ఆతిథ్యం అందించేలా దీనిని నిర్మిస్తున్నారు. కాస్మోపాలిటన్ కల్చర్‌ను తలదన్నే ఫర్నీచర్ ఇతర సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. నీరా, జగ్గర్ తదితర ఉత్పత్తులను తయారు చేసి ఈ కేఫ్‌లో విక్రయించనున్నారు. ప్రకృతిపరంగా లభించే ఈ ఉత్పత్తులు మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యని వైద్యులు సైతం చెబుతున్న నేపథ్యంలో ఈ కేఫ్‌ను ఆనుకున్న దాని కంటే ఎక్కువగా ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నీరా కేఫ్‌లు…
హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్ సక్సెస్‌ను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నీరా కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికను రూపొందించారు. నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన కేఫ్ ఫలితాల ఆధారంగా ఏమైనా ఉత్పత్తులు, అమ్మకాల విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి వాటిని మరింత ఆధునికంగా ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా అన్ని జిల్లా కేంద్రాలు, ఆ తర్వాత తాలుకా, మండల కేంద్రాల వారిగా విస్తరించనున్నట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.