హైదరాబాద్ : ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం కోకాకోలా ఇండియా, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ప్రారంభోత్సవం సందర్భంగా పెట్ బాటిళ్లతో తయారు చేసిన జాతీయ జెండాలను ప్రవేశపెట్టాయి. ఈ పెట్ బాటిల్స్ నూలును ఉత్పత్తి చేయడానికి రీసైకిల్ చేయబడ్డాయి. తరువాత వాటిని జెండాలకోసం ఉపయోగించారు. ఈ జెండాలు స్టేడియంలో ప్రతి మ్యాచ్ జరిగే ముందు జాతీయ గీతం వేడుకలో ఉపయోగించబడతాయని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ జాతీయజెండాను రూపొందించడానికి సుమారు 11,000 పెట్ బాటిల్స్ ను ఉపయోగించారు. ఐసీసీ యూనిటీ ఫ్లాగ్ ను రూపొందించడానికి సుమారు 2000 సీసాలు ఉపయోగించబడ్డాయి.
రీసైకిల్ చేసిన నూలు, వస్త్రాల తయారీలో నిమగ్నమై ఉన్న గణేశా ఎకోవర్స్ లిమిటెడ్ ద్వారా ఈ జెండాలు తయారు చేసినట్లు సంస్థలు వెల్లడించాయి. ఈ అద్భుతమైన జెండాలకు జీవం పోయడానికి 100మంది కార్మికులు 25రోజులు, 300గంటలకు పైగా సమయాన్ని వెచ్చించారు. ఈ సందర్భంగా కోకాకోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అర్నాబ్ రాయ్ మాట్లాడుతూ… కోకాకోలా అన్ని క్రీడా ఈవెంట్లలో అంతర్భాగంగా సుస్థిరదాయకత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఉందని తెలిపారు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో రీ సైకిల్ చేసిన పెట్ తో తయారు చేసిన జాతీయ జెండాలను ఆవిష్కరించడం పట్ల గర్విస్తున్నామని తెలిపారు.