మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, నల్లా నర్సింహులు లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పాంజలి!!
హైదరాబాద్ : మన జాతి పిత, బాపూజీ మహాత్మా గాంధీ, మన మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రీ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు ఈ ముగ్గురూ మూడు శిఖరాలని, వ్యక్తిత్వంలో మహోన్నతులు, ఉద్యమాల్లో ఉద్ధండులు, పోరాటాల్లో వెన్ను చూపని వీరులు… మన జాతి చేసుకున్న పుణ్య పురుషులు అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ముగ్గురు నేతలకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కాలం, ప్రకృతి చాలా గొప్పవని, యాదృచ్చికంగా ఆ ముగ్గురు నేతల జన్మ తేదీ ఒకటే కావడం, వారిలో ఎవరి దారులు వారివి వేరైనా, వారి గమ్యస్థానం మాత్రం ప్రజా శ్రేయస్సు, వారి సుఖ సంతోషాలేనని, ప్రజల కోసం తమ జీవితాలనే త్యాగం చేసి, ధార పోసిన మహా నేతలని ఆయన కొనియాడారు. వారి చిత్ర పటాలకు పూలు చల్లి, పుష్పాంజలి ఘటించారు. వారి సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు వృథా కాలేదని, సీఎం కేసీఆర్ రూపంలో వారి ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ఇలాంటి మహా వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలకనుగుణంగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపారని చెప్పారు.