Tuesday, November 26, 2024

ప‌ద‌వులు పందారం – రెన్యువ‌ల్ ఎవ‌రు…..

నెలాఖరు లేదా మే మొదటివారంలో నోటిఫికేషన్‌
ఎమ్మెల్యే కోటా ఆరు… గవర్నర్‌ కోటా ఒకటి
ఏడాది చివరిలో మరో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
గులాబీ అధినేత కేసీఆర్‌పైనే ఆశావహుల ఆశలు
ప్రతి జిల్లాలో 10 మందికి పైనే ఆశావహులు
గుత్తా, కడియంతో సహా ముగియనున్న ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం
ఆకుల లలితకు రెన్యువల్‌పై హామీ
తుమ్మల, పొంగులేటి, మధుసూదనాచారి, జూపల్లి సహా ప్రచారంలో అనేక మంది పేర్లు
పద్మశాలికి ఎమ్మెల్సీపై సీఎం హామీ
ఈ ఏడాది ఖాళీలే ఖాళీలు.. శాసనమండలిలో నయా తరం

హైదరాబాద్‌, : తెలంగాణ శాసనమండలి ఈ ఏడాది సరికొత్త రూపం సంతరించుకోబోతోంది. ఏకంగా 20మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుండగా, వీరిలో తిరిగి సభకు వచ్చే వారెవరు.. సభతో బంధం తీరిపోయే వారెవరు అన్న చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఇటీవల ఖాళీ అయిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగ్గా.. ఒక్కరు మాత్రమే తిరిగి సభకు వచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించి తిరిగి సభలో అడుగుపెట్టగా, రామచందర్‌రావు స్థానంలో సురభి వాణిదేవి కొత్తగా సభలో అడుగు పెట్టనుంది. మిగతా 18 స్థానాలలో మొదట గా.. త్వరలో 7 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో 6 స్థానాలు ఎమ్మెల్యే కోటాకు సంబంధించినవే. ఈ ఖాళీలతో శాసనమండలి రూపే మారిపోనున్నది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్‌ 4తో ముగియనుండగా, వీటి భర్తీకి సంబంధించి ఏప్రిల్‌ ఆఖరులో లేదా మేలో షెడ్యూల్‌ వస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఖాళీలకు ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉంది. ప్రతి జిల్లాలోనూ.. ఐదు నుండి పది మంది ఆశావహులు ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల సుజాత, ఫరీదుద్దీన్‌ల పదవీకాలం జూన్‌ 4తో ముగుస్తోంది. ఎన్నికకు సంబం ధించి షెడ్యూల్‌ 45రోజుల ముందుగానే వచ్చే అవకాశం ఉండగా, ఆశావహులు నేతల చుట్టూ గట్టిగా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక గవర్నర్‌ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎం.శ్రీనివాసరెడ్డి పదవీకాలం జూన్‌ 17తో ముగియనుంది.
ఎవరికి రెన్యువల్‌
ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఆరుగురిలో ఎవరికి రెన్యువల్‌ అవుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి రెన్యువల్‌ ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు స్థానాల్లో రెడ్డి ఒకటి, మున్నూరు కాపు 2, మైనారిటీ 1, ఎస్సీ 1, పెరిక-1 ఉన్నారు. గవర్నర్‌ కోటాను కూడా కలిపితే రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు రెండుకు పెరుగుతాయి. డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌కు ఇప్పటికే ఒకసారి రెన్యువల్‌ చేసినందున ఈసారి అవకాశం ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత పదవీకాలం కూడా ముగుస్తోంది. నిజామాబాద్‌కు చెందిన లలిత కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో రెన్యువల్‌ హామీ లభించింది. సీఎం కేసీఆర్‌ హామీనిచ్చిన అందరికీ రెన్యువల్‌ చేశారు. అదే పంథాలో ఆకుల లలితకు రెన్యువల్‌ ఖాయమన్న చర్చ పార్టీలో ఉంది.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రెన్యువల్‌ చేస్తారా లేదా వచ్చే అసెంబ్లి , లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక దానిపై హామీనిస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కడియం రెన్యువల్‌ ఆధారంగా వరంగల్‌ రాజకీయాల్లో మార్పుచేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కడియంకు మరోసారి రెన్యువల్‌ చేయవద్దని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, ఆయన వర్గీయులు కోరుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఫరీదుద్దీన్‌కు రెన్యువల్‌ ఉంటుందా లేదా.. అన్నది చూడాల్సి ఉంది. ఇక పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ఇటీవల సీఎం హామీనిచ్చారు. మండలి చీఫ్‌ విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు గతంలో ఒకసారి రెన్యువల్‌ చేసినందున మరోసారి రెన్యువల్‌ చేస్తారా.. ఆ స్థానంలో మరో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణభవన్‌ ఇన్‌ఛార్జిగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న, సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డికి మరోసారి రెన్యువల్‌ లభిస్తుందా.. లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆశావహులు అనేకమంది
ఇక శాసనమండలి ఖాళీలపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లి ఎన్నికల్లో టికెట్‌ ఆశించిన పలువురికి ఎమ్మెల్సీ హామీలు లభించాయి. కొందరికి ఇంకా అవకాశం దక్కలేదు. ఆ తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు, మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడ్డ పలువురు నేతలకు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓపికగా పనిచేసిన వారికి పదవులపై హామీలు.. అధినేత కరుణిస్తారన్న ఆశలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేదు. పలు సామాజిక వర్గాలు మండలి నుండి ప్రాతినిధ్యం ఆశిస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు సంబంధించి రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం ముగియనుండగా, నాగార్జున సాగర్‌కు చెందిన కోటిరెడ్డికి సీఎం కేసీఆర్‌ హామీనిచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరో ఒకరికి గండం పొంచి ఉందని పార్టీవర్గాలలో చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుండి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పేర్లు బలంగా వినబడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లోకి తీసుకోవొచ్చన్న చర్చ చాలాకాలంగా వినబడుతోంది.
ఇందులో నిజమెంత.. అన్నది అధినేతకే తెలియాలి. సామాజిక సమీకరణలు, 2023 లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లా నుండి ఒకరికి ఛాన్స్‌ లభించే అవకాశముందని.. ఆ ఒక్కరు ఎవరనే చర్చ ఉంది. వరంగల్‌ జిల్లాకు సంబంధించి రెండు ఖాళీలు ఏర్పడుతుండగా.. ఇద్దరికి రెన్యువల్‌ ఉంటుందా.. ఒకరికి ఉంటుందా.. వీరి స్థానంలో మరెవరైనా కొత్త నేతలు వస్తారా అన్న చర్చ జరుగుతోంది. వరంగల్‌ నుండి మధుసూదనాచారి, తక్కళ్ళపల్లి రవీందర్‌ రావు, హైదరాబాద్‌ నుండి బండి రమేష్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కరీంనగర్‌ నుండి తుల ఉమ తదితరుల పేర్లు ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌ రెడ్డికి ఈ దఫా ఎమ్మెల్సీ ఖాయమన్న చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు కూడా ప్రచారంలో ఉంది. ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా సమర్థవంతంగా పనిచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ కూడా మండలి సభ్యత్వంపై ఆశలు పెట్టుకున్నారు.
సామాజిక కూర్పు కీలకం
2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణల ఆధారంగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. ఖాళీ కానున్న స్థానాల్లో మూడు నుండి నాలుగు స్థానాల్లో కొత్త వారు రావడం ఖాయమని పార్టీవ ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం దక్కని, మండలిలో ప్రాతినిధ్యం లేని వర్గాల వైపే సీఎం మొగ్గుచూపే అవకాశం ఉంది. గతంలో పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీనిచ్చారు. ఈ టర్మ్‌లో దానిని నెరవేరుస్తారా.. ఈ ఏడాది చివరిలో ఖాళీ కానున్న 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీల సందర్భంగా దానిని నెరవేరుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కుర్మ సామాజిక వర్గానికి చెందిన మల్లేశంకు శాసనమండలి అవకాశం ఇవ్వగా, ముదిరాజ్‌, యాదవ సామాజిక వర్గాలకు చెందిన బండ ప్రకాష్‌, బడుగుల లింగ య్య యాదవ్‌లకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చా రు. సామాజిక కూర్పు, వచ్చే అసెంబ్లి సమీకరణాలను దృష్టి లో పెట్టుకునే పదవుల పందా రం జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement