హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కేక్ కట్ చేసి, రక్త దాన శిబిరం ప్రారంభించడం జరిగింది. అనంతరం కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ ఛైర్మెన్లు, కట్టెల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేడు కేటీఆర్ పేరు మారుమోగుతుందన్నారు. కేటీఆర్ రాజకీయ చతురత, మాటలతో ఓటర్లను ఆకట్టుకునే వాగ్దాటి, వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడు, యువతరానికి స్ఫూర్తి, వేదిక ఏదైనా ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడి ప్రపంచాన్ని మైమరపింపజేసే ఘనుడు అంటూ చెప్పుకొచ్చారు. గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవు అని నమ్మి.. లక్షసాధనగా అడుగుల్లో వేగం పెంచుతూ ప్రజలకు చేరువగా ఉంటుంది లీడర్ కేటీఆర్ అని అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ది ఓ ప్రత్యేక స్థానం అని చెప్పాలిన పనిలేదన్నారు. మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలు సిసలు తెలంగాణ వాది కేటీఆర్ అన్నారు. లోకల్ టు గ్లోబల్ ఏ విషయమైనా వేగంగా స్పందించే గుణం ఆయనదన్నారు. అందుకే ఆయన్ను అందరూ రామన్న అని పిలుస్తుంటారన్నారు. తండ్రి సీఎం కేసీఆర్‌కి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ యాంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని వరల్డ్ వైడ్ గా కేటీఆర్ ను పిలుచుకుంటున్నారనీ శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మడమతిప్పని పోరాటం చేశారన్నారు. 2009లో మొదటిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడలేదన్నారు. తిరిగి 2010 ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014 నుంచి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్విర్తిస్తున్నారన్నారు.
2018లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగుతున్నారన్నారు. కేటీఆర్ ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయన్నారు. సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడంతోపాటు వాటికి తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంటారన్నారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలతో పురుడుపోసుకున్న ఆవిష్కరణలు ఎన్నో. అందుకు హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో డాక్టర్ సైరస్ పూనావాలా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ సెంటర్ నిదర్శనమన్నారు. అంతే కాదు మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ రూపొందించగా, దానిని విజయవంతంగా అమలు చేయడంలో కేటీఆర్ కీలకభూమిక పోషించారన్నారు. వరదల నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్, ట్రాఫిక్ నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్, నగరవాసుల కోసం ఓపెన్ జిమ్‌లు, అర్బన్ పార్క్‌లు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు కేటీఆర్ శ్రీకారం చుట్టినట్లు శ్రవణ్ పేర్కొన్నారు. మరోసారి కేటీఆర్ కు 47వ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ భవిష్యత్ లో ఇంకా ఎంతో ఎత్తుకు కేటీఆర్ ఎదగాలని శ్రవణ్ కోరారు.