డీపీఆర్‌లు లేకుండా ప్రాజెక్టులు వస్తాయా
కేంద్రం అనుమతిస్తుందా
లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి
చేతనైతే కాళేశ్వరానికి జాతీయ హోదా తెండి
కాళ్లలో కట్టెలు పెట్టవద్దు
భాజపా, కాంగ్రెస్‌లపై మంత్రి హరీష్ ధ్వజం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని అంటున్నారని, ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుం డా అనుమతులు వస్తాయా అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లిdలో నీటి పారుదల పద్దులపై హరీష్‌రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తాజాగా దుబ్బాక నియోజకవర్గం లోని గూడవల్లి వాగులో నీళ్లు వచ్చి అక్కడ 11 వేల ఎక రాలు కొత్తగా సాగులోకి వస్తే సంతోషంగా ఉందన్నారు. ‘దేశభక్తి మాక్కూడా ఉంది. దేశ భక్తి సరే స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయింది. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటేనే బీజేపీ నేతలు ఢిల్లిdకి వెళ్లారు. వారికి రాజకీయ భుక్తి మీద ధ్యాస ఉంది కానీ రైతు అంటే భక్తి లేదు. చేతనైతే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయండి. లేదంటే కాళ్లల్లో కట్టె మాత్రం పెట్టకండి. చేతనైతే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకురండి. అసెంబ్లిdలో తీర్మానం చేసి అభినందిస్తాం. పక్కనున్న రాష్ట్రాలు శరవేగంగా ప్రాజెక్టు కడుతుంటే మన రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులే మన ప్రాజెక్టులు ఆపుతున్నారు. బీజేపీ నేతలకు క్షుద్ర రాజకీయాలు తగవు. మాతో కలిసి రండి. జాతీయ ప్రాజెక్టు తీసుకురండి. తెలంగాణ వాటర్ కన్జర్వేషన్‌పై ఐఏఎస్‌లకు శిక్షనిస్తున్నారు. దీనిని బట్టి తెలంగాణ గొప్పతనం తెలుస్తోంది. పోతిరెడ్డిపాడుపై ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడింది టీఆర్‌ఎస్ పార్టీ. కాళేశ్వరం మూడో టీఎంసీ అంచనాలు పెరిగితే అవినీతి ఉందని ప్రచారం చేస్తున్నారు. నాగార్జునసాగర్ మొదలుపెట్టినప్పటి నుంచి 800 శాతం పెరిగింది. ఎస్సారెస్పీ 40 కోట్లతో డీపీఆర్ చేస్తే ప్రాజెక్టు పూర్తయినపుడు 4000 కోట్లకు అంచనాలు పెరిగాయి. జూరాల, పులిచింతల అన్ని ప్రాజెక్టుల అంచనాలు కూడాపెరిగాయి. 10 శాతం పనికాని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అంచనాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచార’ని హరీష్ వివరించారు.
హైదరాబాద్‌కు 3 నదుల నీళ్లు
గండిపేటకు రూ.100 కోట్లు కేటాయించాం. అభివృద్ధి చేసిన తర్వాత వెళ్లి ఈత కూడా కొడదాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను తీసుకొచ్చి గండిపేట, హిమాయత్‌సాగర్‌లో పోస్తాం. ఓ పక్క హైదరాబాద్‌కు సుంకిశాల నుంచి కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. సింగూరును కూడా కాళేశ్వరంతో అనుసంధానం చేసి హైదరాబాద్ నగరానికి 3 నదుల నీళ్లు తీసుకొచ్చి నీటి కొరత అనేది లేకుండా చేస్తాం’ అని హరీష్‌రావు ఎంఐఎం సభ్యుడు మీర్‌జాఫర్ హుస్సేన్‌కు సమాధానమిచ్చారు.
ఎస్‌ఎల్‌బీసీ పై వెయ్యి కోట్లు ఖర్చు చేశాం
తెలంగాణ వచ్చిన తర్వాత రూ.1000 కోట్లు ఎస్‌ఎల్‌బీసీ మీద ఖర్చు పెట్టాం. ఈ మధ్యే కొత్త బోరింగ్ మిషన్ వచ్చి పనులు మళ్లి ప్రారంభమయ్యాయి. ఉదయ సముద్రం మీద ఆరేళ్లలో రూ.193 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినదానికి సమానం. మునుగోడు మట్టిలో ఫ్లోరైడ్ ఉంది. కృష్ణా నది నీళ్లొచ్చి రెండు మూడు పంటలు పండితేనే ఆ సమస్యకూ పరిష్కారం లభిస్తుంది. ఉదయసముద్రం ప్రాజెక్టు భూ సేకరణను అడ్డుపడకుండా సహకరించాలని కోరుతున్నా. ప్రభుత్వం నల్గొండకు అన్యాయం చేసిందనడం అవాస్తవం. తాజాగా బడ్జెట్‌లో ఎక్కువ మేర లిఫ్టులను నల్గొండకే కేటాయించాం’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి హరీష్ సమాధానమిచ్చారు.
పెద్దపల్లి కాలువల సమస్యలకు శాశ్వత పరిష్కారం
డీ-83,డీ-86 కాలువల సమస్యలకు కాళేశ్వరం లింకు కెనాల్‌ను నిర్మించి శాశ్వతంగా పరిష్కరించే అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
కోమటిరెడ్డికి కౌంటర్
ఉదయ సముద్రం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుపై 95 శాతం ఖర్చు పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంతో సమానంగా తాము ఖర్చు పెట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 3 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు వస్తున్నందుకు రాజగోపాల్ రెడ్డి తమను అభినందించాల్సిందిపోయి తమపై అవాస్తవాలు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
ఉద్యోగాలు భర్తీ చకచకా…
తక్షణమే 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రకటిం చారు. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు వెలువడను న్నాయన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల నిరుద్యోగులపైనా, ఖాళీల భర్తీపైనా ఎలాంటి ప్రభావం చూపదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇచ్చి ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ తీసుకొచ్చిన తెలంగాణ పేమెంట్ సాలరీస్ అండ్ పెన్షన్… రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్-2021 చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత మంత్రి హరీష్‌రావు బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 60, 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయస్సు కొనసాగుతోందన్నారు. పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా ఉద్యోగుల అనుభ వాలు ఉపయోగపడతాయన్నారు. ఈ విషయాన్ని వేతన సవరణ కమిషన్ కూడా సిఫారసు చేసింద న్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల నిరుద్యోగులపైనా, ఖాళీల భర్తీపైనా ఎలాంటి ప్రభావం చూపదన్నారు. వెంటనే ప్రమోషన్లు ఇచ్చి ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో వెంటనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.