హైదరాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవలసిన చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన సహా అన్ని జిల్లాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.