కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేపడుతున్న నాలా పనులను శాసనసభ్యులు వివేకానంద గౌడ్ తో కలిసి మంగళవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ ఫాక్స్ సాగర్ సర్ ప్లస్ నాలా, చెరువు పునరుద్దరణ, ఫాక్స్ సాగర్ తూము నుండి కెమికల్ నాలా వరకు, కోల్ కాలువ నుండి వయా వెన్నెలగడ్డ చెరువు మీదుగా కెమికల్ నాలా వరకు రూ. 95 కోట్ల వ్యయంతో చేపట్టే నాలా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… వరదల మూలంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాలా అభివృద్ధి పనులను మొదటి దశలో రూ. 858 కోట్ల వ్యయంతో 60 పనులలో 37 పనులు జిహెచ్ఎంసి పరిధిలో మరో 23 పనులు జిహెచ్ఎంసి చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో చేపట్టగా అన్ని పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో వరద వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, నాలా అభివృద్ధి పునరుద్దరణ పనులు మే మాసం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అందరూ సహకరించాలని, ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. గత సంవత్సరంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురైన విషయం అందరికీ తెలుసునని, శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేయాలని, ఏదైనా సమస్య ఎదురైతే తమకు తెలియజేస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు వివేకానందగౌడ్, జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement