మలక్‌పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ఇటీవల మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడంతో అధికారులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేపట్టారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచచాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగానే వారు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఇద్దరితో పాటు అంతకుముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కాస్త ఆందోళకరంగా ఉందని, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మరో 9 మందిని సోమవారం డిశ్చార్జి చేయగా.. ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement