Saturday, November 23, 2024

తెలంగాణ‌లో లాక్ డౌన్ త‌ప్ప‌దా….?

విస్ఫోటనంలా కేసులు
పదివేల మార్కుకు చేరువ..
రోజుకు వందకు పైనే మతులు
కఠిన లాకడౌేన్‌ తప్పనిసరి అంటున్న నిపుణులు
వైద్య ఆరోగ్యశాఖ అధికార వర్గాలది అదే సూచన
ఏప్రిల్‌ 30 తర్వాత నిర్ణయం

ప్రస్తుతం వైద్యం పూర్తిస్థాయిలో చేస్తున్నా.. టెస్టింగ్‌ కిట్లు పూర్తిస్థాయిలో సరిపోని పరిస్థితి నెలకొనడం, పాజిటివ్‌లు కూడా జనం మధ్యలో సాధారణంగా తిరుగుతూ సులువుగా ఇతరులకు వ్యాప్తి చేస్తుండడంతో కట్టడిచేయడం సాధ్యంకావడం లేదు. ముందు కరోనాను ఇళ్ళలో కట్టడిచేస్తే, ప్రజల కదలికలను నియంత్రిస్తే.. మరణాల సంఖ్యను తగ్గించుకోగలమని సూచనలు అందుతున్నాయి.
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నైట్‌కర్ఫ్యూ ప్రసక్తే లేదు.. లాక్‌డౌన్‌ ఉండదు అంటూ.. పదేపదే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నైట్‌కర్ఫ్యూ అమలుచేస్తోంది. కర్ఫ్యూ అమలు తర్వాత కూడా కేసుల సంఖ్య తగ్గకపోగా, మరింత పెరిగింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటగా, నేడో.. రేపో ఇది పదివేల మార్క్‌ను తాకుతుంది. ఇంక అనధికారికంగా ఉన్న కేసులు, సొంత వైద్యం చేసుకుంటున్న రోగులు.. ఇందుకు ఎన్నోరెట్లు. ఇక మృతుల సంఖ్య అధికారికంగానే.. ఆదివారం 38మంది చనిపోయినట్లు ప్రకటించగా, గాంధీ ఆస్పత్రి, నిమ్స్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వందమందికి పైగానే చనిపోతున్నారు. గాంధీతో పాటు టిమ్స్‌లోనూ.. ప్రతిరోజూ పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఆస్పత్రికి చేరేలోపే పోతున్న ప్రాణాలు కోకొల్లలు. ఆక్సిజన్‌ కొరత, మందుల కొరత, వెంటిలేటర్లు, బెడ్లకొరతతో వైద్యరంగంపై.. ఆస్పత్రులు, డాక్టర్లు, వైద్యసిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగు తోంది. ఇంకా కేసుల సంఖ్య పెరుగుతుందని.. మే 10 నాటికి పీక్స్‌కు చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇపుడున్న డిమాండ్‌నే తట్టుకోలేని పరిస్థితి ఉండగా, కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతుంటే కళ్ళముందే చనిపోతున్నా నిస్సహాయంగా ఏం చేయలేని స్థితికి డాక్టర్లు చేరుకుంటారని, వైద్యసిబ్బందిపై ఒత్తిడి తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే.. కఠిన లాక్‌డౌనే శరణ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిస్థితి చేయిదాటిపోకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లి, తమిళనాడు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో పరిస్థితులు క్షీణించాయి. ఆయా ప్రాంతాలతో పోలిస్తే.. తెలంగాణ పరిస్థితి బెటర్‌. కానీ మహమ్మారి వేగంగా.. విస్తరిస్తున్న దృష్ట్యా మహారాష్ట్ర, ఢిల్లిలు ఎదుర్కొంటున్న పరిస్థితి రావొద్దంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కఠిన లాక్‌డౌనే మేలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు, వీటిపై ఆధ్యయనం చేసిన ప్రొఫెసర్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. బెంగాల్‌ ఎన్నికల తర్వాత లాక్‌డౌన్‌పై కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవొచ్చన్న చర్చ జరుగుతోంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తూనే.. కఠినంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వస్థాయిలో పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా.. ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా తీవ్రంగా గండిపడుతుంది. ప్రజల ప్రాణాలకంటే డబ్బు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ చెబుతుంటారు. ఆర్థికంగా దెబ్బపడ్డా.. వ్యవసాయరంగ పురోగతి, గ్రామీణ తెలంగాణ దన్నుతో తెలంగాణ వేగంగా కోలుకోగలదని, పూర్వపుఫామ్‌ను సులువుగా సాధించగలదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో.. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మెరుగైన పరిష్కారంగా సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం వైద్యం పూర్తిస్థాయిలో చేస్తున్నా.. టెస్టింగ్‌ కిట్లు పూర్తిస్థాయిలో సరిపోని పరిస్థితి నెలకొనడం, పాజిటివ్‌లు కూడా జనం మధ్యలో సాధారణంగా తిరుగుతూ సులువుగా ఇతరులకు వ్యాప్తి చేస్తుండడంతో కట్టడిచేయడం సాధ్యంకాలేదు. ముందు కరోనాను ఇళ్ళలో కట్టడిచేస్తే, ప్రజల కదలికలను నియంత్రిస్తే.. మరణాల సంఖ్యను తగ్గించుకోగలమని సూచనలు అందుతున్నాయి. ప్రజలకు ప్రస్తుతం కరోనాపై పూర్తి అవగాహన వచ్చిందని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇళ్ళకే పరిమితమవుతున్నారని.. సీరియస్‌ అయినవారే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని వైద్య శాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి. కఠిన లాక్‌డౌన్‌ వల్ల కేసుల సంఖ్య ఖచ్చితంగా నియంత్రించబ డుతుందని, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని.. ఆస్పత్రులలో చేరుతున్న వారికి సకాలంలో వైద్యం చేయగలుగు తారని సూచనలు అందుతున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ వంటి ప్రముఖులు కూడా కరోనా ప్రభావానికి గురి కాగా, ఏప్రిల్‌ 30 తర్వాత లాక్‌డౌన్‌ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈనెల 30తో రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలు ముగియనుండగా, మే 1లేదా 3 నుండి లాక్‌డౌన్‌కు అవకాశాలు న్నాయని బెట్టింగ్‌లు కూడా జోరుగా జరుగుతున్నాయి. కఠిన లాక్‌డౌన్‌, పాజిటివ్‌లకు సీరియస్‌ కేసులకు వైద్యం, వ్యాక్సినేషన్‌ నిరాటంకంగా కొనసాగించడం.. ఈ మూడింటికి సంబంధించి రకరకాల ప్రతిపాదనలు, ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం వద్ద చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై చర్చ జరగనుంది. ఇప్పటికే రూ.2500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఫ్రీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం మే1 తర్వాత దీనిని ఎలా కొనసాగించాలి.. లాక్‌డౌన్‌ ఉంటే ఎలా.. లేకుంటే ఎలా.. ప్రజలను కట్టడి చేయడం ఎలా వంటి అంశాలను పరిశీలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement