Wednesday, November 20, 2024

రియ‌ల్ భూమ్… రివ‌ర్స్ భ‌యం…

హైదరాబాద్‌, : గతేడాది కొవిడ్‌ సంక్షోభం అనంతరం తేరుకుని ఇప్పుడిప్పుడే విక్రయాలు ఊపందుకున్న దశలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ప్రస్తుతం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బకు తాజాగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ విధించడంతో మున్ముందు లాక్‌డౌన్‌ కూడా తప్పదేమోనని వలస కార్మికుల్లో ఆందోళన ప్రారంభమైంది. కర్ఫ్యూ ముదిరి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రారంభం కాకముందే సొంతూళ్లు బాట పడితే మంచిదని వారంతా అనుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్‌ వేవ్‌లో పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు ప్రకటిస్తున్న టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న హైదరాబాద్‌ లోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పనిచేస్తున్న పలువురు వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు రైలు టికెట్‌ రిజర్వ్‌ చేసుకోవడానికి కాచిగూడ, సికింద్రా బాద్‌, నాంపల్లి తదితర రైల్వే స్టేషన్‌లకు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. తమ ఊళ్లకు వెళ్లే రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు, టికెట్ల లభ్యతపై విచారిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే సొంత ప్రదేశాలకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు పని కోసం వచ్చిన వారైతే ఇవ్లీుబన్‌, జేబీఎస్‌ బస్‌స్టేషన్‌ల వద్దకు బస్సు కోసం పరుగులు తీస్తున్నారు. నేను కరోనాకు భయపడడం లేదు. మళ్లి లాక్‌డౌన్‌ విధిస్తే కూలీ దొరకదు. జేబులో డబ్బులు ఖాళీ అవుతాయి. తినడానికి తిండి, ఉండడానికి ఆశ్రయం లేకుండా పోతాయి. సొంత ఊరికి వెళదామంటే అన్నీ బంద్‌ అవుతాయి. పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది అని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చిన బీహార్‌కు చెందిన కార్మికుడు ఒకరు చెప్పారు. ఇంకొందరు వలస కార్మికులైతే తాము కుటుంబానికి దూరంగా ఉంటున్నామని, కరోనా సోకి తమకు ఏమైనా జరగరానిది జరిగితే ఎవరికీ కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోకుండా ఇక్కడే అంత్యక్రియలు చేసే పరిస్థితి వస్తుందని, ఇలాంటి పరిస్థితి తమకు వద్దని వారు చెబుతున్నారు.
80 శాతం మంది వలస కార్మికులే…
హైదరాబాద్‌ నగరంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో 80 శాతం దాకా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే ఉంటారని అంచనా. వీరిలో కొందరు స్కిల్‌ వర్కర్లు కాగా మరి కొందరు సెమీ స్కిల్డ్‌ వర్కర్లు. గతేడాది కరోనా సంక్షోభం ముందు వరకు హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో కలిపి సమారు 5 లక్షల మంది దాకా వలస కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేసేవారు. అయితే కరోనా మొదటి వేవ్‌ దెబ్బకు బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికుల్లో ఇంకా తిరిగిరాని వారున్నారని పలువురు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల యజమానులు చెబుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో ప్రస్తుతం విధించిన కర్ఫ్యూతో మళ్లి లాక్‌డౌన్‌ విధిస్తారేమోనన్న భయం వెంటాడుతోందని వారు పేర్కొం టున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో కనీసం 3 నుంచి 4 లక్షల మంది దాకా వలస కార్మికులు నిత్యం పనిచేస్తుంటేనే పరిశ్రమ సజావుగా ముందుకు వెళుతుందని కంపెనీల యజమానులు చెబుతున్నారు. లేదంటే ఇటు రెసిడెన్షియల్‌, అటు కమర్షియల్‌ ప్రాజెక్టులు సమయానికి పూర్తవక ఖర్చు, అప్పులకు వడ్డీలు తడిసి మోపెడవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ ఖర్చుకు తోడు లేబర్‌ కొరత
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్‌ సప్లై చైన్‌ ప్రభావంతో స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, కంకర అన్నింటి ధరలు గతంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం పెరిగాయి. దీంతో బిల్డర్లకు నిర్మాణ ఖర్చు పెరిగిపోయింది. ఈ ఖర్చును భరిస్తూ వినియోగదారులకు సరైన సమయంలో ఇళ్లు, ఫ్లాట్లు అందించడానికి బిల్డర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇంతలో సెకండ్‌ వేవ్‌లో భాగంగా కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తుండడంతో తలెత్తిన కార్మికుల రివర్స్‌ వలసల భయం వారిని కుంగదీస్తోంది. వలస కార్మికులు తిరిగి వారి స్వస్థలాలకు వెళితే లేబర్‌ ఖర్చు తడిసి మోపెడై భవన నిర్మాణం మరింత భారమయ్యే ప్రమాదం లేకపోలేదని వారు వాపోతున్నారు. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే నగరంలో కోలుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం తిరిగి మందగమనానికి లోనవడం ఖాయయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రెడాయ్‌లో సభ్యులుగా ఉన్న పేరొందిన బ్రాండెండ్‌ డెవలపర్‌ కంపెనీలు గతేడాది లాక్‌డౌన్‌ అనుభవంతో తమ వద్ద పనిచేసే వలస కార్మికుల వసతి, భోజన సౌకర్యం కల్పించేందుకు వీలుగా పలు శిబిరాలను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాయి. ఒక వేళ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పరిస్థితి వచ్చినప్పటికీ వలస కార్మికులను తమ వద్దే ఉంచుకునే ఏర్పాట్లను చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు, ముఖ్యంగా వలస కార్మికులకు కొవిడ్‌ టీకాను కూడా ఇప్పించే బాధ్యత తమదేనని కొద్ది రోజుల క్రితం క్రెడాయ్‌ ప్రకటించింది. ఈ తరహా చర్యలతో ఈసారి లాక్‌డౌన్‌ విధించినప్పటికీ గతంలోలా కాకుండా కొంతవరకు వలస కార్మికులు ఇక్కడే ఉండే అవకాశాలు లేకపోలేదని కొందరు బిల్డర్లు చెబుతున్నారు. వీరికి తోడు గతేడాది వలస కార్మికులు వెళ్లిపోయినపుడు స్థానికంగా ఉండే ఉపాధి లేని వారికి తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌లో నిర్మాణ రంగంలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు కూడా ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. ఈ చర్యలన్నీ ఈ సారి వలస కార్మికుల రివర్స్‌ మైగ్రేషన్‌ సమస్య నుంచి కొంతవరకు బిల్డర్లను కాపాడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో రియల్‌ బూమ్‌…
గతేడాది పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ తదనంతర పరిణామాలలో దేశవ్యాప్తంగా పుంజుకుంది. లాక్‌డౌన్‌లో పడిపోయిన డిమాండ్‌తో పాటు ప్రస్తుత డిమాండ్‌ ఒకేసారి రావడంతో నిర్మాణం పూర్తౖ యి నివసించడానికి సిద్ధంగా ఉన్న రెడీ టు మూవ్‌ ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి దీంతో డెవలపింగ్‌ కంపెనీలు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌ను ప్రారంభించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో స్క్కేర్‌ ఫీట్‌ ధర ఇతర మెట్రో నగరాలతో పోల్చినపుడు తక్కువగా ఉండడంతో ఇక్కడ నగరం నలువైపులా రియల్‌ బూమ్‌ వచ్చింది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలతో వడ్డీరేట్లు దిగి రావడం కూడా రియల్‌ బూమ్‌కు ఒక కారణంగా పలువురు రియల్టిd రంగ నిపుణులు చెబుతున్నారు. మరో పక్క కొవిడ్‌ సంక్షోభాన్ని ఐటీ, ఫార్మా రంగాలు ధీటుగా ఎదుర్కోవడంతో ఆ రెండు రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో పేరొందిన కంపెనీల నుంచి వాణిజ్య కార్యాలయ లీజులు కూడా భారీగా పెరిగాయి. దీంతో కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్టులకు కూడా గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో ఇటీవల చెప్పుకోదగ్గ రెండు మూడు పెద్ద డీల్స్‌ జరగడంతో నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశం దృష్టిని ఆకర్షించింది. వెరసి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లతున్న భాగ్య నగర రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రస్తుత కరోనా సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ వేస్తుందా లేదా అన్నది కొవిడ్‌ను ప్రభుత్వాలు ఎలా నియంత్రణలోకి తెస్తాయన్నదానిపై ఆధారపడి ఉంటుందని పలువురు నిర్మాణ రంగ నిపుణలు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement