…ఎల్బీనగర్ డిసెంబర్ 01 ప్రభ న్యూస్. అహంకారం, అవినీతి తో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పనున్నట్లు ఎఐసిసి సెక్రెటరీ, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని, ఎల్బీనగర్ లో భారీ విజయం సాధించబోతున్నట్లు అయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ పౌరుల త్యాగాలతో ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ భోగాలకు ప్రజలు చమర గీతం పాడారన్నారు. వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, టీజేఏస్, సీపీఐ ,ప్రజా సంఘాలు పార్టీల కతీతంగా మద్దతు పలికిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అందరిని కలవలేకపోయానని , అయినా ఆదరించిన మీ అందరికీ రుణపడి ఉంటాను అన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ ప్రజల ఆకాంక్షలను ఆవిరి చేయడంతో మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, బీఆర్ఎస్ బిజెపిలో రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. బీసీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బిజెపి.. బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్న ప్రజలు ఎవ్వరు విశ్వసించలేదన్నారు.
అహంకారం, అవినీతి ,కుట్ర దారులు, వెన్నుపోటు, పార్టీ ఫిరాయింపు దారులకు ఎల్బీనగర్ ప్రజలు ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పారని, ప్రశ్నిస్తే దాడులు చేసే వీష సంస్కృతి ఇక స్వస్తి అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ ఓటమికి గల కారణాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటింగ్ రోజున ప్రజల స్పందన, ఓటర్ల సరళి గమనిస్తే ప్రజలు మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. సకల జనుల ప్రేమ, అన్ని వర్గాల అండ ఆదరణతో ఎల్బీనగర్ లో భారీ విజయాన్ని సాధిస్తున్నామని తెలిపారు.