Friday, November 22, 2024

తెలంగాణలో భూముల విలువ పెంపు…

హైదరాబాద్‌, : ఆదాయార్జనకు కీలకంగా స్టాంపు డ్యూటీ పెంపుతోపాటు భారీగా వ్యత్యాసం ఉన్న వాస్తవ విలువకు, బుక్‌ విలువలకు ఉన్న తేడాలను సవరిం చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్టాంపు డ్యూటీ 7శాతం వరకు ఉండగా, తెలం గాణలో స్టాంపు డ్యూటీ ప్రస్తుతం 6 శాతంగా ఉంది. దీనిని 6 నుంచి 10శాతం వరకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే తొలుత దీనిపై ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలున్నాయని, ప్రజలపై ప్రత్యక్ష భారం పడేలా ఉన్న స్టాంపు డ్యూటీని పెంచడంపై సీఎం కేసీఆర్ సుము ఖంగా లేరని అధికారులు అంటున్నారు. స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్‌ వ్యాపారులు, డెవలపర్లు, వెంచర్లు వేసే వ్యాపారులపై కాకుండా బ్యాంకు రుణాలు తీసుకుని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే ప్రజలపైనే ఎక్కువ భారం పడుతుందని సీఎం కేసీఆర్‌ విభేదించారని తెలిసింది. కానీ తాజా బడ్జెట్‌లో స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని రెట్టింపుకంటే ఎక్కువ చేయడంతో రాబడి పెంపునకు ఉన్న అన్ని మార్గాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు ప్రధానంగా మార్కెట్‌ విలువల సవరణ తప్పనిసరని ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని రూరల్‌ ఏరియాల్లో రెండేళ్లకోసారి, పట్టణాల్లో ఏటా భూముల మార్కెట్‌ విలువలను సవరించడం ఆనవాయితీ. అయితే రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 2013కు ముందు ఒకసారి విలువల సవరణ చేశారు. ఇందులో స్టాంపు డ్యూటీ 4.5శాతం, 1.5 శాతం బదలీ రుసుము, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక మార్కెట్‌ విలువల అంశానికి వస్తే ప్రాంతాన్ని బట్టి 50నుంచి 300వాతం వరకు పెంపు యోచన చేస్తున్నారు. ఈ దఫా నిరర్ధక ఆస్తులు, ఇండ్ల విక్రయం దిశగా దృష్టి సారించిన ప్రభుత్వం పన్నేతర ఆదాయాన్ని రూ.30,500 కోట్లుగా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపై రాబడితోపాటు స్టాంపు డ్యూటీ పెంచడం ద్వారా రెండు రకాలుగా ఖజనాకు రాబడి చేరుతుందనే అంచనాలతో ఉంది. వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇప్పటికే కీలక సిఫార్సులు చేసింది. ఆస్తుల విక్రయంతో ఒకేసారి రాబడితోపాటు, ఏడాది పొడువునా రిజిస్ట్రేషన్ల రాబడికి స్టాంపు డ్యూటీ పెంపు, మార్కెట్‌ విలువల పెంపు కీలకమని తెలిపింది. పలు శాఖల్లో విధానాల్లో మార్పులు తేవాలని, కూడా సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement