హైదరాబాద్, ఆంధ్రప్రభ: గులాబీ పార్టీలో అసంతృప్తి నేతలు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గత గొడవలన్ని పక్కన పెట్టాలని ఆదేశించింది. స్థానిక ఎమ్మెల్యేలు లోకల్‌గా ఉన్న పార్టీ నేతలకు సరైన గౌరవం ఇవ్వాలని సూచించింది. అందరి సేవలను ఉపయోగించుకోవాలని తెలిపింది. అసంతృప్తి వాదులతో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సీరియస్‌గా స్పష్టం చేసింది. అంతర్గత గొడవలు, గ్రూప్ పాలిటిక్స్‌ను పక్కన పెట్టి ఒక్కతాటిపై నడవాలని డైరెక్షన్ ఇచ్చింది. అంతేకాదు స్వయంగా ఎమ్మెల్యేలే వారితో మాట్లాడి గొడవలను సర్దుబాటు చేసుకోవాలని తెలిపింది. పలు జిల్లాల్లోని అంతర్గత ఘర్షణలు, వివాదాలపై ఆరా తీసింది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ పికారని గులాబీ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. మరో వర్గాన్ని తక్కువ చేసి చూడకూడదని, పార్టీ కోసం పని చేసే వారికి సరైన గౌరవం దక్కేలా చూడాలని కూడా తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే ప్రకారం ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం కలిగేలా పరిస్థితులు ఉన్నాయో.. ఆయా ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు. కొందరితో ఫోన్లోనే గట్టిగా హెచ్చరించారని కూడా సమాచారం.
ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఎమ్మెల్యేలు, పార్టీ పరిస్థితిపై పూర్తి వివరాలు గులాబీ అధినేత సీఎం కేసీఆర్‌కు అందాయి. ఆ సమాచారంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయా ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సీరియస్ వార్నింగ్ కూడా కొంత మందికి ఇచ్చినట్లు తెలుస్తోంది. పద్దతి మార్చుకోకపోతే టికెట్ కష్టమని కూడా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలిపారు. స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలిపించుకోని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలా గెలుస్తారు అని ప్రశ్నించారు. విజయంపై అతి నమ్మకం మంచిది కాదని, వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా పార్టీలోని ఆ నియోజకవర్గం అసమ్మతి నేతలతో స్వయంగా మాట్లాడి గొడవలను పక్కన పెట్టి కలిసి కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు.
పనిచేస్తున్న కేటీఆర్ మంతనాలు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించడంతో ఆయా ఎమ్మెల్యేలు, అసంతృప్తి నేతలతో కలిసి పని చేస్తున్నారు. కొన్ని చోట్ల వారితో చర్చించి పార్టీ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనను గెలిపించే బాధ్యత మీదే అంటూ టికెట్ ఆశావాహుల భుజాలపై బాధ్యతను పెట్టి సెంటిమెంట్‌ను చూపిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పని చేద్దామని కేటీఆర్ చెప్పిన విధంగా నడుచుకుందామని చర్చించుకుంటున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో సఖ్యత కుదరలేదు. మరి కొద్ది రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లోనూ నేతలంతా దారిలోకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
హైదరాబాద్ ప్రాంతంతో పాటు శివారు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో ఉండి వర్గాలుగా విడిపోయిన వారి జాబితాతో మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో చర్చించారు. ముఖ్యంగా తనతోనే ఉంటూ స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలవని వారిని కూడా ఇద్దరు కలిసి గొడవలను సర్ధుబాటు చేసుకోవాలని తెలిపారు. మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువగా సమస్యలు తమ దృష్టికి వస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, టికెట్ ఆశిస్తున్న వారి మధ్య గ్యాప్‌ను తగ్గించుకునేందుకు కూర్చోని మాట్లాడుకోవాలని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇలానే ఎన్నికల సమయంలో కూడా పరిస్థితి ఉంటే గెలుపు సాధ్యం కాదంటూ హెచ్చరించారు.
గౌడ సామాజిక వర్గంకు సంబంధించిన ఎమ్మెల్యేతో కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అన్న పేరున్న ఓ ప్రముఖ నేత మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విషయాన్ని వారికి గుర్తు చేశారు. ఇద్దరు కలిసి పని చేయాల్సిందేనని, పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఇక హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, టికెట్ ఆశిస్తున్న ఓ నేత మధ్య గ్యాప్ కనిపిస్తుంది. ఎన్నో సార్లు మీడియా ముందు కూడా వారి మధ్య గొడవలతో రచ్చకెక్కారు. ఇదే విషయంపై కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టికెట్ ఆశావాహికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరు కలిసి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. టికెట్ విషయంలో గొడవలు వద్దని స్పష్టం చేశారు.
ఇక సీనియర్ నేతను అంటూ మేడ్చల్ జిల్లాలో చెప్పుకునే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఫోన్లోనే మంత్రి కేటీఆర్ గట్టిగా హెచ్చరించారని తెలుస్తోంది. పార్టీ నేతలను కాదని తన కొడుకు ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా మండిపడ్డారని తెలుస్తోంది. మళ్లిd ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లాలోనూ జరుగుతున్న అంతర్గత గొడవలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల తీరును ప్రశ్నించారు. సర్దుకుపోవాలి.. లేదంటే కష్టమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన ఓ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఆయనపై సీరియస్ అయ్యారు. పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తీరును టికెట్ ఆశిస్తున్న గులాబీ నేత కడిగిపారేస్తున్నారు. ఆ విషయాలను కూడా కేటీఆర్ ఎమ్మెల్యేతో ప్రస్తావించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలదంటూ అసహానం వ్యక్తం చేశారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని తెలిపారు. గత ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేతను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని తెలిపారు. అయితే ఇదే నెలలో అమిత్ షా పర్యటన ఉండటంతో బీఆర్ఎస్ నేతలంతా అలెర్ట్‌గా ఉన్నారు. జంపింగ్‌లు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు.