హైదరాబాద్, : హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవంతంగా ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల కల్పనపైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటిదాకా సుమారు లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసం ఉపయోగించండి. ప్రజలకు సేవ అందించడమే పరమావధిగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. మీదైన మార్కు చూపించే విధంగా సేవా దృక్పథాన్ని విడనాడకుండా పని చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. ఎలాగైతే ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలిగారో అదే విధంగా ఒక్క రూపాయి తీసుకోకుండా అత్యంత నిజాయితీతో ప్రజా సేవకి పాటు పడాలన్నారు. ఈ ఉద్యోగాన్ని ఒక సవాల్‌గా తీసుకొని జల మండలిని మరింత అభివృద్ధిపథాన నిలిపే విధంగా వినూత్న ఆలోచనలతో పని చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement