Friday, November 22, 2024

వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు కెటిఆర్ శంకుస్థాపన

హైద‌రాబాద్ : మూసాపేట్ సర్కిల్ లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు రూ. 99 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ. 3,500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజీ పున‌ర్ నిర్మాణ ప‌నులు చేప‌డుతామ‌న్నారు. గతంలో రూ. 3,000 కోట్లతో తాగు నీరందించే ప‌నులు విజ‌య‌వంతంగా చేప‌ట్టామని తెలిపారు. కైత‌ల‌పూర్‌లో డంపింగ్ యార్డ్ స‌మ‌స్య ఉన్నందున, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా ఆధునీక‌ర‌ణ ట్రాన్స్‌ఫ‌ర్ పాయింట్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. వ‌ర్షాకాలంలో ఇండ్లలోకి నీరు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. శివారు ప్రాంతాల‌కు తాగునీటిని ఇస్తున్నామని, డ్రైనేజీ సిస్ట‌మ్‌ను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామ‌ని, దీంతో శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement