హైదరాబాద్ : రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. మన్నెగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ, చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని కేటీఆర్ మండిపడ్డారు.
చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తుందన్నారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్‌కు తెలిసినంత ఎవరికి తెలియదని అంటూ సీఎం కేసీఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా మగ్గం ఉన్న ప్రతి ఇంటికి చేనేత మిత్ర పేరుతో రూ. మూడు వేలు సాయం చేస్తామని ప్రకటించారు..