Saturday, November 23, 2024

సీఎం కేసీఆర్ నిర్ణ‌యంపై.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన‌ కిషోర్ గౌడ్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలల‌ను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని, నూతనంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 బీసీ మహిళా డిగ్రీ గురుకుల‌ కళాశాల‌లు ఏర్పాటు చేయాలని, ఎస్సీ ,ఎస్టీ , బీసీ మైనార్టీ విద్యార్థి, నిరుద్యోగుల కోసం జిల్లాకు నాలుగు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే సివిల్ సర్వీస్, పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కేంద్రంగా నాలుగు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.


దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అందులో ఉన్నత విద్యనందించాల‌నే గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ వాటిని జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైన నిర్ణయమ‌న్నారు. నూతనంగా 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ పోటీ పరీక్షల శిక్షణ కోసం నాలుగు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా సంతోషకరమ‌న్నారు. ఇంత పెద్ద ఎత్తున చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యువత పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన‌ని కిషోర్ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement