కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడట్లేదని.. ఆయన మాట్లాడాలని.. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా అనే అనుమానం కలుగుతోందని రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్, కిషన్‌రెడ్డి యాసంగిలో ధాన్యం వేయమని రైతులకు సూచనలు చేశారని చెప్పారు. నెలా పదిహేను రోజులుగా తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదన్నారు. రైస్ మిల్లుల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పెద్దలు కూలుస్తున్నారని, కేంద్రం వారి ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తే కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పారు. రైతులు ధాన్యం పండించాక ఇప్పుడు బియ్యం కొనడంలో కేంద్రం మెలికలు పెడుతోందన్నారు. రైతుల ఘోస పట్టించుకోకుండా ఈటల రాజేందర్ అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధాన్యం సేకరణపై తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.