హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమని, వాటిని దేశ వ్యాప్తం చేయడానికే జాతీయ పార్టీ పెట్టారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి.రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం మణికొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మణికొండలోని సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి, అంబేడ్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తమ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో 60 లక్షల మంది కార్యకర్తలు కుటుంబ సభ్యులుగా ఉన్నారని, ఖమ్మంలో జరిగిన ఘటనలో మృతి చెందిన నలుగురు కార్యకర్తలకు బాధాకరమని, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు పరిపాలన చేత కాదు అన్న వారికి చెంప పెట్టుగా దేశంలో నెంబర్ వన్ గా పరిపాలన చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ టర్నోవర్ 50 వేల కోట్లు కాగా రాష్ట్రం ఏర్పడ్డాక అది 2 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, కేవలం ఒక్క ఐటీ సెక్టార్ లోనే 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మంత్రి కేటీఆర్ దేనన్నారు. హైదరాబాద్ కు తలమానికం ఐటీ సెక్టార్ అని, హైదరాబాద్ లో ఇస్ ఆఫ్ డోయింగ్ బిజినెస్ పేరిట కేటీఆర్ తీసుకున్న చొరవ తో హైదరాబాద్ లో పెట్టుబడులు పెరిగాయన్నారు.
వ్యాక్సిన్ ను ప్రొడ్యూస్ చేసి వంద దేశాలకు ఎక్స్ పోర్ట్ చేసిన ఘనత హైదరాబాద్ దేనని తెలిపారు.
తాను ఇక్కడ చదువుకునే రోజుల్లో గండిపేట చెరువు దగ్గరికి వెళ్లి ఆడుకునే వాళ్ళమని, 100 కోట్లతో గండిపేట్ చెరువు టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయమని పార్లమెంట్ లో తాను ప్రశ్నించిన స్పందన లేదన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో గండిపేట చెరువు టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో మన ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఒక్క ఇల్లు కూడా లేదన్నారు. రాజేంద్ర నగర్ నియోజక వర్గంలో ఆరున్నర కోట్లతో కొత్తగా 5 రిజర్వాయర్ లు కడుతున్నారని, కోటిన్నర తో పైప్ లైన్ వేసి, 150 కాలనీలు కనెక్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. అలకా పూరి టౌన్ షిప్ లో ఉండే రేడియల్ కనెక్టివిటీ రోడ్ నెంబర్ 4, 5 లు ఔటర్ రింగ్ రోడ్డు కు కనెక్టివిటీ కోసం 70 మీటర్ల స్థలం కంటోన్మెంట్ బోర్డు వారు తమ స్థలమని అబ్జెక్షన్ చెప్పడంతో రోడ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి నిమిత్తమై స్థానికులు పలుమార్లు విన్నవించడంతో తాను స్థానిక కలెక్టర్, ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డుతో సైతం తాను మాట్లాడానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చి, అది త్వరలోనే కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేస్తామన్నారు. తాము గెలిచిందే కార్యకర్తల వల్ల అని, ఎవరికీ ఏ పని ఉన్న జస్ట్ ఫోన్ చేస్తే తాను చేసి పెడతానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యయనీ, వాటిని దేశ వ్యాప్తం చేయడం కోసమే కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టినట్టు ఆయన వివరించారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ప్రారంభ సమయంలో సాక్షాత్ అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ సైతం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని పేర్కొన్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టే దేశాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో, దేశంలో కెసిఆర్ నాయకత్వాన్ని బల పర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంఎల్సి మహేందర్ రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ శ్రీ రాములు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.