వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు పదోన్నతిపై పార్టీ శ్రేణుల్లో చర్చ
సాగర్ ఉపఎన్నిక తర్వాత మంత్రివర్గ మార్పుచేర్పులకు ఛాన్స్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పదవులు కూడా
రేపు సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్
హైదరాబాద్, : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎస్ పార్టీలో ఫుల్ జోష్ నింపాయి. ఇటీవల కాలంలో.. ఏ ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ ఇంత పకడ్బందీగా, పట్టుదలగా ఫైట్ చేయకపోగా.. ఈ విజయం పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ విజయం ద్వారా పార్టీ ఫుల్ ఫామ్‌లోకి రావడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోష్‌లో ఉన్నారు. నేతల్లోనూ.. విజయానికి కారణమైన వర్గాల్లోనూ జోష్ నింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ.. అనేక రూపాల్లో బలంగా దండెత్తినా, మొండిగా పోరాడి క్షేత్రంలో విజేతలుగా తిరిగొచ్చిన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డిలకు ప్రమోషన్ ఖాయమన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగించి.. మేలో మంత్రివర్గ మార్పుచేర్పులు చేసే అవకాశముందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ఉపఎన్నిక, కార్పోరేషన్, పెండింగ్ మునిసిపాలిటీల ఎన్నికలు ముగిస్తే మరో రెండున్నరేళ్ళపాటు.. ఏ ఎన్నికలు ఉండవు కాబట్టి.. 2023 విజయం కోసం సరికొత్త టీమ్‌ను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ క్రమంలో కేబినెట్‌లో నాలుగు నుండి ఆరు మార్పులు ఉండవచ్చని చాలా కాలంగా పార్టీ ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ ఉంది. ఇదే టీమ్‌తో 2023 ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని పార్టీలోని.. ముఖ్యనేతలు చెబుతుండగా, మార్పులకు సరైన సమయం.. సందర్భం ఆసన్నమైందన్న టాక్ వినబడుతోంది. ఆయా జిల్లాలు, సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని మార్పుచేర్పులకు సంబంధించి సీఎం నిర్ణయం తీసుకోనుండగా, పార్టీకి అవసరమైన సమయంలో.. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుని గెలిచి వచ్చిన ఇద్దరికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని నేతలు విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణులు.. ఒకరకమైన ఒత్తిడి వాతావరణానికి వెళ్ళిన దశలో, పార్టీకి అచ్చిరాని గ్రౌండ్‌లో.. బరిలోకి దిగి, అధినేత నిర్దేశించినట్లుగా బ్యాటింగ్ చేసి విజేతలుగా తిరిగివచ్చిన వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డిలపై అభినందనల జల్లు కురుస్తోంది.
వాణీదేవికి క్లీన్ ఇమేజ్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె కావడం.. అందరికీ త్వరగా తెలిసేందుకు ఉపకరిస్తే, తన వాగ్దాటితో పట్టభద్రులను మెప్పించింది. వీటన్నింటికీ మించి ఎన్నికల వ్యూహరచనలో సీఎం ప్రదర్శించిన చాణక్యం విజయతీరం చేర్చింది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకే క్షేత్రంలో కట్టగట్టుకుని పోరాడినా, మొండిగా.. ఏటికి ఎదురీది, ముఖ్యమంత్రినే నమ్ముకుని ముందుకెళ్ళారు. విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్సే కాక ప్రొఫెసర్ కోదండరామ్, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్ లాంటి టీఆర్‌ఎస్ వ్యతిరేకశక్తులన్నింటినీ ఒకేచోట ఎదుర్కొని తడబడకుండా.. లక్ష్యాన్ని చేరి పల్లా గల్లా ఎగరేశారు. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలవడం.. పార్టీ భవిష్యత్తుపై మొలకెత్తుతున్న అనుమానపు తెరలన్నింటినీ తొలగించి పూర్వ ఉత్సాహాన్ని తీసుకురాగా, ఈ ఇద్దరికీ పదోన్నతికి సంబంధించి సీఎం సంకేతాలు ఇచ్చినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ మార్పుచేర్పులంటూ జరిగితే ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. దీనికితోడు.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరికి గండం ఉంటుంది. పార్టీ ఇపుడున్న తిరుగులేని స్థితిలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో తీసుకుంటారన్న అభిప్రాయం రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు ఉంది.
ఎమ్మెల్యేలకు నామినేటెడ్ బొనాంజా
పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వరుస ఎన్నికలు, కరోనా కారణంగా వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం సాధ్యం కాలేదు. సాగర్, కార్పోరేషన్ ఎన్నికల తర్వాత మే, జూన్ మాసాల్లో.. పదవుల పండుగ కొనసాగనుంది. కనీసం పదిమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్పోరేషన్ పదవులు దక్కనున్నాయి. కీలక కార్పోరేషన్ చైర్మన్ పదవులు అనేకం ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. గతంలో ఆయా పదవుల్లో ఉన్నవారి టర్మ్ పూర్తికావడంతో.. మాజీలుగా మారారు. యాభైకి పైగా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉండగా, క్రమంగా వీటిని భర్తీ చేసుకుంటూ వెళ్ళనున్నారు. ముందుగా ఎమ్మెల్యేలకు మాత్రం పదవుల వరమాల పడే అవకాశముంది. గతంలో హామీనిచ్చిన నేతలకు అవకాశాన్ని బట్టి సంతృప్తిపరచాలని అధినేత నిర్ణయించారు.
పదవులు.. ఖాళీలు..
త్వరలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో పాటు చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీకాలం ముగియనుంది. జూన్ 4తో వీరి పదవీకాలం ముగియనుండగా, ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఈ ఖాళీల భర్తీకి ఏప్రిల్ ఆఖరులో లేదా మే మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. వీరికి రెన్యువల్ ఉంటుందా.. ఈ స్థానాల్లోకి కొత్తవారు ఎవరొస్తారన్నది ఆసక్తికరం. కేబినెట్ మార్పులు, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, చీఫ్ విప్ వంటి నియామకాలన్నీ.. ఒకేసారి ఉండనున్నాయి. పెద్ద ఎత్తున అటు అసెంబ్లిd, ఇటు కౌన్సిల్ సభ్యులకు పదోన్నతులు, మార్పుచేర్పులు జరగనున్నట్లు సమాచారం. పాలనా ప్రక్షాళనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంవోలో మరికొన్ని మార్పులు చేస్తారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. అటు అధికార యంత్రాంగం, ఇటు జిల్లాలను లీడ్ చేసి.. 2023లో ఫలితాలు తీసుకొచ్చేదిశగా సమర్ధవంతంగా పనిచేసే నాయకత్వానికి సీఎం బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే యువ ఎమ్మెల్యేలకు, కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తూ వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. పార్టీ అంచనాలకు అనుగుణంగా పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామని చెబుతున్నారు.