పీఆర్సీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్
కేంద్ర ఉద్యోగులతో సమానంగా అలవెన్స్‌లు
మండలి జోష్‌లో అడగనివీ ఇస్తారని ఆశలు
వరాలపై అందరిలోనూ ఉత్కంఠఉద్యోగులకు 34శాతం ఫిట్‌మెంట్ ఉండే అవకాశం ఉందని, 2018 జులై నుండి ఎరియర్స్, కేంద్ర ఉద్యోగులతో సమానంగా అలవెన్స్‌లు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పదవీవిరమణ వయసు 60కి పెంపు, పాత జోన్ల ప్రకారం గ్రూప్-1, 2, 3 నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అధ్యయనానికి కమిటీ, టెట్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వంటి అంశాలన్నింటినీ సీఎం తేల్చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలలో, సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది…
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. వేతన సవరణపై త్వరలో ప్రకటన చేస్తానని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల ఊపులో ఉండడం, నాగార్జునసాగర్ షెడ్యూల్ ప్రకటించినా.. పీఆర్‌సీ ప్రకటనకు అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇందుకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో ఆదివారం సమావేశమయ్యారు. పీఆర్‌సీ, పదవీవిరమణ పెంపు సహా ఇతర అంశాలను ఉద్యోగసంఘాల నేతలతో సీఎం చర్చించారు. అడిగినవే కాకుండా.. అడగనివీ మరికొన్ని సీఎం ప్రకటనలో ఉండే అవకాశం ఉంది.
పీఆర్సీ, పదవీవిరమణ వయసుపెంపు, సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పింఛన్, ఈహెచ్‌ఎస్ తదితర సౌకర్యాలన్నీ ముఖ్యమంత్రి ప్రకటనలో ఉండే అవకాశం ఉంది. ఆర్థికశాఖ కేటాయింపుల్లో.. పీఆర్‌సీ కోసమే ప్రత్యేకంగా రూ.8 వేల కోట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 27శాతం మధ్యంతర భృతి ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే ఎక్కువే పీఆర్‌సీ ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగసంఘాలతో మాటల సందర్భంగా చెప్పారు. 29శాతం ఇస్తారని ఉద్యోగ సంఘాలు అనంతరం చెప్పాయి. తాజాగా విజయాల జోష్.. ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తుండడంతో సీఎం మరింత సానుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆదివారం ప్రగతిభవన్‌కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు ఫిట్‌మెంట్‌ను 33 శాతంగా ఇవ్వాలని కోరారు. సోమవారం అసెం బ్లి వేదికగా సీఎం పీఆర్సీ, పదవీ విరమణ పెంపు, సీపీఎస్ ఉద్యో గులకు పెన్షన్ స్కీం వర్తింపు వంటి అంశాలపై ప్రకటన చేయ నున్నారు. ఈ నెల 10న ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఫిట్‌మెంట్‌పై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు 30 శాతం వరకు ఇవ్వాలని చెప్పామని, 29 శాతంగా ఇచ్చేందుకు అంగీకారం వచ్చిందంటూ ప్రకటన చేశారు. అయితే మండలి ఎన్నికల్లో రెండు చోట్లా అధికార పార్టీ అభ్యర్థులు గెలిచిన తరుణంలో ఉద్యోగ సంఘాలు 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాయి. సోమవారం సీఎం ప్రకటన ద్వారానే ఎంత శాతమో తేలుతుంది. అయితే.. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీ, ఇతర సదుపాయాలకు సంబంధించిన గుడ్ న్యూస్ మాత్రం మరికొద్దిసేపటిలో రానుంది.