కరోనా బారినపడిన సీఎం కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో బుధవారం రాత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు సీటీ స్కాన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), సీఆర్పీ, ఐఎల్-6, డీడైమర్, ఫెరిటీన్, ఎల్‌డీహెచ్, లివర్, కిడ్నీ ఫంక్షన్ .. ఇలా మొత్తం 9 రకాల పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐఎల్-6 పరీక్ష చాలా ముఖ్యమైందని తెలుస్తోంది. 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని, సీటీ స్కాన్‌లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని డాక్టర్లు వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకొని త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. సీటీ స్కాన్ చేశామని, నార్మల్‌గా ఉన్నదని పేర్కొన్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగున్నాయని చెప్పారు. సీటీ స్కాన్‌తోపాటు సాధారణ పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఏమీ లేవని, వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ హోంఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు.
.