Tuesday, November 26, 2024

సాగ‌ర్ అభ్య‌ర్ధి ఎంపిక‌లో కెసిఆర్ ప‌క్కా లెక్క‌…

అభ్యర్థి ఖరారు వెనుక కేసీఆర్‌ సుదీర్ఘ కసరత్తు
బీసీ వ్యూహం.. ప్రత్యర్థుల గందరగోళం
ఒక్క ఎన్నికతో.. ఎన్నో వ్యూహాలు
పారని బీజేపీ ఎత్తులు.. జంప్‌జిలానీపై ఫలించని ఆశలు
నోముల వారసుడికి కలిసొచ్చిన సీఎం లెక్కలు

హైదరాబాద్‌, : నాగార్జునసాగర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఏ లెక్కలను పరిశీలిస్తున్నారోనన్న చర్చ, రకరకాల పేర్లను పార్టీనే ప్రచారంలో ఉంచడంతో చివరికి అదృష్టం ఎవరిని వరిస్తుం దోనని ముఖ్యనేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటు కాగా, యాదవ సామాజికవర్గంలో టీఆర్‌ఎస్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి పట్టు ఉంది. యాదవుల ఆర్థిక ప్రగతికి చేపట్టిన పథకాలు, రాజకీయంగానూ ఇచ్చిన ప్రాధాన్యం ఇందుకు కారణం. గత ఎన్నికల్లో జనరల్ సీటును బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నోముల నర్సింహ్మయ్యకు ఇచ్చింది. దుబ్బాలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్‌ ఇచ్చి దెబ్బతిన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అభ్యర్థిత్వంపై సీఎం ఎంతో కసరత్తు చేసి, ఎన్నో సమీకరణలు పరిశీలించారు. తొలుత నోముల తనయుడు స్థానికేతరుడని, స్థానిక యాదవుల్లో ఎవరో ఒక యాదవనేతకు ఇచ్చే అవకాశం ఉందని.. సీఎం పలువురితో ఫోన్‌లో మాట్లాడారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం తర్వాత కూడా అనేక సార్లు సర్వేలు నిర్వహించారు. సర్వేలలో యాదవ సామాజిక వర్గంలో, బీసీలలో భగత్‌కే మొగ్గు కనిపించింది. ఇక రెడ్డి సామాజికవర్గం నుండి మంత్రి జగదీష్‌రెడ్డి అనుచరుడు ఎంసి కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల పేర్లు బలంగా వినిపించాయి. టికెట్‌ దక్కకుంటే వీరిలో ఒకరు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషం దాకా ప్రయ త్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎత్తులు పారకుండా టీఆర్‌ఎస్‌ కట్టుదిట్టంగా వ్యవహరించింది. ఓ దశలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నిలపవచ్చని పార్టీవర్గాలు ప్రచారం చేశాయి. ఇందుకు ముగియనున్న పదవీకాలాన్ని కారణంగా ముందుపెట్టాయి. అనేక ప్రచారాలు.. వీటి చుట్టూ ముసురుకున్న లెక్కలన్నింటినీ టీఆర్‌ఎస్‌ అధిష్టానం సూక్ష్మంగా, నిశితంగా పరిశీలించింది. చివరకు ఉన్నత విద్యావంతుడైన యాదవ సామాజికవర్గానికి చెందిన యువకుడికి టికెట్‌ ఇవ్వడం ద్వారా బీసీ ముద్రను కొనసాగించడంతో పాటు అదే సందర్భంలో ప్రత్యర్థి పార్టీ ఎత్తులు చిత్తుచేసింది. నోముల వారసుడికి టికెట్‌ ఇవ్వడం ద్వారా.. భవిష్యత్తుల్లో పార్టీ సీనియర్‌ నేతల వారసుల్లోనూ పార్టీ సరైన సమయంలో అవకాశాలు కల్పిస్తుందని, ఇది తమ పార్టీ అని ఓన్‌ చేసుకుని భవిష్యత్తు కోసం మరింత కష్టపడతారని అధిష్టానం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారసులే రాజకీయ వ్యవహారాలను కష్టపడి చూసు కుంటుండగా, ఆ వర్గానికి ఇది ఓ సంకేతంగా చెబుతున్నారు. దీనికి తోడు సాధారణ సమీకరణల కోణంలోనూ బీసీల సీటు బీసీలకే ఇవ్వడం, ఇతరులకు ఆప్షన్‌ లేకుండా చేయడం మరో వ్యూహంగా చెబుతున్నారు. వారసుడిగా ఉన్నంత మాత్రాన టికెట్‌ ఇవ్వాలని లేదని, అదే సందర్భంలో వారసత్వం ప్రతిభ ఉన్నవారి ఎదుగుదలకు ఆటంకం కావొద్దని టీఆర్‌ఎస్‌ అధిష్టానం పలు లెక్కలు పరిశీలించింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నుండి వాణీదేవిని నిలిపిన సందర్భంగా సీఎం చూపిన చాణక్యం, నాగార్జునసాగర్‌ అభ్యర్థి ఎంపిక సందర్భంగానూ ప్రదర్శిం చారని పార్టీనేతలు ఆనందంగా చెబుతున్నారు. పార్టీ క్యాడర్‌ ఈ ఎంపికను స్వాగ తిస్తోంది. సాగర్‌లోనూ హర్షం వ్యక్తమవుతోంది. సీఎం వ్యూహాల ముందు బీజేపీ అభ్యర్థి ఎంపికలో క్లీన్‌ బౌల్డ్‌ అయిందని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2.17లక్షల ఓట్లు ఉండగా.. బీసీ ఓటర్ల సంఖ్యే ఇం దులో 1,05,495 ఉండడం విశేషం. వీరిలో యాదవ ఓటర్ల సంఖ్య 34,267. దీంతో ఈ ఓట్లు గంపగుత్తగా పడతాయన్న అంచనాతో అదే సామాజి కవ ర్గానికి మరోసారి టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఈ సమీకరణ బాగా పనిచేసింది. బీసీ ఓటర్లలో రెండొ స్థానంలో ముదిరాజుల ఓట్లు 12,721, మూడో స్థానంలో గౌడ కుల స్తుల ఓట్లు 9,948 ఉన్నాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు 8,115. రజక సామాజి కవర్గం ఓట్లు 7,896, మున్నూరుకాపుల ఓట్లు 6,515 ఉన్నారు. ఎస్సీ ఓటర్ల సంఖ్య 37, 671, లంబాడీలు 38,332 మంది ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి సామా జిక వర్గ ఓట్లు 23,472 ఉన్నాయి. అనేక లెక్కలు పరిశీలించి..చివరకు బీసీ వైపే మొగ్గు చూపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement