Friday, November 15, 2024

అంబేద్క‌ర్, జ‌గ్జీవ‌న్ రామ్ ల స్ఫూర్తితోనే కేసీఆర్ పాల‌న : మంత్రి త‌ల‌సాని

బాబా సాహెబ్ అంబేద్క‌ర్, బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ ల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్, అంబేద్క‌ర్ విగ్రహాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్ లు పూలమాల‌లు వేసి నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి, బేగంపేటలోని ఎన్బీటీ నగర్ లో, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంటలలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావితరాలకు ఆదర్శమ‌న్నారు. దళితుల కోసం తమ జీవితాలను ధార పోసిన మహా నేతలు బాబా సాహెబ్, బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ లు అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలోనే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో బన్సీలాల్ పేట, సనత్ నగర్, బేగంపేట కార్పొరేటర్ లు హేమలత, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, నిర్వహకులు నారాయణ, లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, శ్రీహరి, శేఖర్, లక్ష్మీపతి, ప్రేమ్, అబ్బాస్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement