Thursday, November 21, 2024

ఈ ఏడాది చివ‌రికి పాలమూరు లిఫ్ట్…. కెసిఆర్

కాళేశ్వర వేగంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికావాలి
ప్రతీవారం.. ప్రాజెక్టును సందర్శించండి
కృష్ణాజలాలను.. ప్రతి వాటా చుక్క వాడుకుందాం
పాలమూరును పూర్తిస్థాయి పంటపొలాలతో పచ్చగా మార్చుకుందాం
ఇరిగేషన్‌ శాఖ తెలంగాణకు లైఫ్‌లైన్‌
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాళేశ్వరం పనులు ఎంత వడివడిగా జరిగాయో అర్థం చేసుకొని.. అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్‌లోని పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాల పనులు సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్‌ అధికారులు పూర్తిస్తాయి నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతిపై, పనులను మరింత వేగవంతం చేయడంపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్‌, కృష్ణమోహన్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, హర్షవర్దన్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌రావు, సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఎస్‌ఈలు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు నీటిగోస.. నల్లగొండ ఫ్లోరైడ్‌ కష్టాలు లేకుండా నా ప్రసంగం లేదు
తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌ నగర్‌ నీటి గోసను, నల్లగొండ ఫ్లొరైడ్‌ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగులో పెట్టినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్‌ గోయింగ్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం. జూరాలతో సహా ఇప్పటికే మనం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొసరు పనులు మిగిలినయి. వాటిని ఎట్లా అతి త్వరలో పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్పూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయినా సరే, పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేసుకోవాలి” అని సీఎం అన్నారు.
చుక్కనీరు పోకుండా ఒడిసిపడదాం
గోదావరి నదీ ప్రవాహానికి కృష్టా నదీ ప్రవాహానికి తేడా వుంటుందని, సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే.. కృష్టా నదీ ప్రవాహం తగ్గుతూ వస్తుంటదని సీఎం విశ్లేషించారు. రాను రాను వర్షాలు తగ్గిపోవడం దానికి తోడు కృష్టా నదిమీద ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూముల వలన కృష్ణానదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టా నదిమీది అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసుకోవా ల్సిందేనని సీఎం జల వనరుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
పచ్చని పాలమూరు చేసుకుందాం
కృష్టా జలాలను మలుపుకోని పాలమూరును పూర్తిస్తాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామని సీఎం అన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే రైతన్నలకు వ్యవసాయ రంగానికి అంతమంచిదని, ఈ పథకాన్ని జూరాలకు లింక్‌ చేసుకోవచ్చని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూ సేకరణ, పునరావాసం, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం, కాలువల తొవ్వకం, పంపుల ఏర్పాటు, తదితర నీటి సరఫరా పనులకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులతో సిఎం చర్చించారు. భూసేకరణ కోసం పునరావాసం కోసం చెల్లించాల్సిన డబ్బు ఎంత అవసరం? ఇంకా భూసేకరణ సహా పెండింగ్‌లో వున్న పనుల వివరాలేమిటి? మొత్తం రిజర్వాయర్లు ఎన్ని నీటి నిల్వ పెంచుకోవడానికి వాటిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరమున్నదా? వాటిల్లో పూర్తిస్తాయి నిల్వ సామర్థ్యం ఎంత? అనే విషయాల మీద సీఎం సుదీర్ఘంగా చర్చించారు. అక్కడక్కడా పనులు నిదానంగా నడుస్తుండడం పట్ల సీఎం స్పందించి, మరింత శ్రద్ధగా పనులు పూర్తిచేయాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు.

పంపులు త్వరగా బిగించండి
నార్లాపూర్‌, ఏదుల, వట్టెం వద్ద ఏర్పాటు చేయాల్సిన పంపులను త్వరలో బిగించాలని సీఎం సూచించారు. నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు టన్నెల్‌ పనుల పూర్తికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజనీర్లను ఆరాతీసారు. జూన్‌ నెలాఖరు కల్లా పనులు పూర్తి కావాలన్నారు. వట్టెం నుంచి కరివేనకు వరకు కెనాల్‌ పనులెంతవరకు వచ్చాయని,. కాల్వ లైనింగ్‌ కోసం జరుగుతున్న పనుల పురోగతిని సిఎం అడిగి తెలుసుకున్నారు. కావాల్సినన్ని నిధులను ప్రభుత్వం అందిస్తున్నా కూడా పనుల జాప్యం పట్ల అధికారులను ప్రశ్నించిన సీఎం, ఇక నుంచి పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ఇరిగేషన్‌ అధికారులు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. వారం వారం సమీక్షలు జరుపుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్‌, రజత్‌ కుమార్‌, మురళీధర్‌ రావులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వడివడిగా జరిగాయో అర్థం చేసుకొని.. అదే స్పూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు.
ఇరిగేషన్‌ శాఖలో వివిధ స్థాయి అధికారులకు నిధులు అందుబాటులో ఉంచిందని సీఎం గుర్తు చేసారు. హైద్రాబాద్‌ వరకు రానవసరం లేకుండా ఎక్కడి అధికారి అక్కడనే తమ నిధులను ఖర్చు చేస్తూ పనులు చేపట్టే వెసులుబాటు కల్పించిం దన్నారు. అంతగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్‌ ఇంజనీర్లు మనసుపెట్టి పనిచేయాలన్నారు. ఇరిగేషన్‌ శాఖ తెలంగాణకు లైఫ్‌ లైన్‌ వంటిదని సీఎం కితాబిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement