Monday, September 16, 2024

స్వాప్నికుడి క‌ల – నిజ‌మైన వేళ‌

హైదరాబాద్ : ఆరున్నరేళ్ళలో.. ఎంత మార్పు. తెలంగాణలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి.. ఇంకా పెరుగుతున్నాయి. ఒక్క హైదరా బాద్‌.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలే కాదు.. రాష్ట్రమంతటా ఒకటే ట్రెండ్‌. ఈ ట్రెండ్‌ ఎలా సాధ్య మైంది. సమూలంగా.. భూసమాజ మంతా ఎలా వృద్ధిచెందింది. ఒక రంగానికి.. ఒక వ్యవస్థకు పరి మితం కాకుండా అన్నిరంగాలు వృద్ధిచెందేందుకు దోహదపడ్డ మంత్రం ఏంటి? ఓ రాష్ట్ర రాజధానో.. ఓ జిల్లా కేంద్రమో కాకుండా.. రాష్ట్రంలోని ప్రతిప్రాంతంలోనూ భూముల ధరలు నమ్మశక్యం కాకుండా ఎలా పెరిగాయి? ఈ అసాధారణ వృద్ధి ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు భూముల ధరలు పెరిగాయంటే.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఐటీ పరిశ్రమ ఉందనో, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వచ్చిందనో పెరిగేవి. ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల కొంత పెరిగేవి. కానీ రాష్ట్రమంతా పూనకం వచ్చినట్లు ధరలు పెరగడం ఏంటి?
ఈ విప్లవాత్మక మార్పునకు కారణం కేసీఆర్‌. తెలంగా ణను స్వప్నించి.. సాకారం చేసినట్లే.. మొత్తం తెెలంగాణ సమాజంపై ప్రభావం చూపేది.. అత్యంత వేగంగా వృద్ధిని ఆవిష్కరించే కలగనడం, కళ్ళముందు నిలువెత్తు వృద్ధిని ఆవిష్కరించడం సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందని ఆర్థిక, సామాజికరంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లి లో భూముల విలువ పెరుగుదలపై సీఎం చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇందుకు కారణాలపై చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ మహోన్నత విజన్‌.. దూరదృష్టి.. జలసిరులతో.. తెలంగాణను సస్యశ్యామలం చేసి, వ్యవసాయానికి భరోసా కల్పించి నిలబెట్టిన నిజాయితీ, అదేపనిగా రైతుకు అండగా నిలుస్తూ.. పుడమిపై చూపిన ప్రేమ మొత్తం తెలంగాణ సమాజాన్నే మార్చేసింది. పుడమి పులకించడంతో.. విలువ ఆకాశమంత పెరిగింది. తెలంగాణ భూములు హాట్‌ కేక్‌గా, అభివృద్ధి కేంద్రాలుగా విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి.
ప్రతి పని పద్ధతిగా..
సీఎం కేసీఆర్‌ ఏ పనిచేసినా చాలా శ్రద్ధగా, పద్ధతిగా చేస్తారు. సమస్య అంతుచూసేదాకా, విజన్‌ ఆవిష్కృతమయ్యేదాకా విశ్రమించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. ముందు విద్యుత్‌ రంగంపై దృష్టిపెట్టారు. ఆ సమస్య పరిష్కారమవడంతో పరిశ్రమలు వికసించాయి. ఉత్పత్తులు పెరిగాయి. కొత్తపరిశ్రమలు రావడం మొదలుపెట్టాయి. ఇది హైదరాబాద్‌ అభివృద్ధికి.. గమనానికి తొలి భరోసానిచ్చింది. వలసలకు బ్రేక్‌ వేసింది. ఇంకోవైపు ఎపుడొస్తుందో తెలియని కరెంట్‌తో ఆగమాగమైన వ్యవసాయం.. కరెంట్‌ సమస్య పరిష్కారంతో గాడినపడింది. ఆ తర్వాత మిషన్‌ కాకతీయతో రాష్ట్రమంతా చెరువుల పునరుద్దరణ జరిగింది. జలవనరులు పెరగడం, కరెంట్‌ సమస్య లేకపోవడంతో వ్యవసాయం మెరుగైంది. రైతు విలువ, రైతు నమ్ముకున్న భూమి విలువ క్రమంగా పెరిగింది. ఇక ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని చేపట్టి.. విక్రయానికి సిద్ధంగా ఉన్న వారి నుండి 6నుండి 7లక్షల ధర వెచ్చించి కొనుగోలు చేసింది. దీనికితోడు భారీ ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల నిర్వాసితులకు కూడా ఎకరానికి 6నుండి 15లక్షల దాకా పరిహారం చెల్లించింది.
రాష్ట్రమంతా ప్రాజెక్టులు.. ఈ కార్యక్రమాలు ఉండడంతో ఒక్కసారిగా భూమంతర్‌ రాగా, రేట్లు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కొత్త జిల్లా కేంద్రాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు రావడం, వీటి కారణంగా కొత్త కార్యాలయాలు.. రావడం మరింత ఊపిరిపోసింది. రైతులకు మరింత భరోసానిచ్చేలా రైతుబంధు పథకం తీసుకురావడం, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకురావడం, ఏ ప్రాంతంలో కూడా రైతులు సాగునీటితో ఇబ్బందులు పడకుండా సీఎం ఎప్పటికపుడు పర్యవేక్షించడం, వచ్చే వరదను.. వర్షాన్ని, ఆపదను, అవసరాన్ని అన్నింటినీ పసిగట్టి రైతు పంటను కంటికి రెప్పలా సీఎం కేసీఆర్‌ కాపుగాస్తుండడంతో రైతాంగం లో వ్యవసాయంపై పూర్తి భరోసా ఏర్పడింది. పెరిగిన జలవనరులతో.. గ్రామాల్లో పెరిగిన ఉపాధి అవకాశాలతో పట్టణాలు, నగరాలకు వెళ్ళిన జనులు కూడా స్వంత గ్రామాలకు వలస రావడం ప్రారంభించారు. భూమిపై పెరిగిన మమకారానికి, భూమి కల్పించిన భరోసాకు ఇది నిదర్శనం. ఈ భరోసా భూముల విలువ మరింత పెంచింది. ఇక కరోనా తర్వాత పెట్టుబడుల లెక్కలన్నీ మారిపోయాయి. నగరాలు, పట్టణాల్లో ఉన్నవారు కూడా పల్లెబాట, సొంతూరి బాట పట్టారు. అక్కడ మారిన దృశ్యాలు.. తెలంగాణ తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. అబ్బురపరిచింది.. ఆశ్చర్యపరిచింది.. ఆలోచించేలా చేసింది. దీంతో నగరాల్లోని పెట్టుబడులు పల్లెలకు దౌడుతీస్తున్నాయి. ఎక్కడైనా భూముల కొనవచ్చన్న ధైర్యాన్నిచ్చింది. తెలంగాణలో భూములు అమ్మి.. ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ రేటుకు ఎక్కువ భూమిని కొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నవి. ఒకప్పుడు ఏపీలో భూముల విలువలు బాగుండేవి. ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి.. తెలంగాణలో రెండెకరాలు కొనుక్కునేవారు. తెలంగాణ వస్తే భూముల ధర ఇంకా తగ్గుతుందని ప్రచారం చేశారు. కానీ భూముల ధరలు రెట్టింపయ్యాయని సీఎం కేసీఆర్‌ అసెంబ్లి లో చేసిన ప్రకటన వాస్తవస్థితికి అద్దం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల వ్యవసాయరంగంలో 17.73శాతం వృద్ధి నమోదు చేసింది.
ధరణి ధీమా
రిజిస్ట్రేషన్లు చాలా కాలం నిలుపుదల చేయడం, ధరణి ఆరంంలో తలెత్తిన లోపాలు.. ఆరంభంలో అనేక చర్చకు, అనుమానాలకు దారితీసింది. సీఎం విజన్‌ స్పష్టంగా ఉండడంతో.. క్రమంగా సమస్యలన్నీ తెరమరుగై ధరణి అత్యంత పారదర్శక, సులువైన పరిష్కారంగా మారింది. రెవెన్యూ కార్యాలయాల్లో భూముల క్రయవిక్రయాల్లో జరిగే లంచాల బెడదకు చెక్‌ చెప్పింది. రాష్ట్రంలో మొత్తం అన్నిరకాల భూములు 2.77కోట్ల ఎకరాలు ఉండగా, 1.5కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు ధరణిలో నమోదయ్యాయి. రైతుకు అండగా నిలబడే చర్యలు, సాయం చేసే ఆలోచనలు నిరంతరం జరుగుతున్నాయి. రైతు కోణంలో.. ప్రతి సమస్యను ఆలోచిస్తూ, పరిష్కరిస్తుండడంతో రైతు నమ్ముకున్న భూమి విలువ పెరిగింది. తెలంగాణ సగర్వంగా నిలబడేలా చేసింది. సంపద ఎన్నోరెట్లు వృద్ధి చెందింది. అద్భుత విజన్‌.. అలా లక్షల కుటుంబాల జీవన గమనాన్ని మార్చి.. ప్రమాణాలను పెంచింది.


ఎంత మార్పు…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూముల ధరలు అమాంతంగా, అనూహ్యంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో.. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేటే గ్రోత్‌ లేదు. ఇండ్లధరలు కూడా అంతంతమాత్రమే. ప్లాట్లు కొనే దిక్కులేదు. హైదరాబాద్‌ నుండి చాలా మంది వెళ్ళిపోతరు.. కొనే దిక్కు ఉండదంటూ.. ఆరంభంలో ఎవరైనా అమ్ముకుందామన్నా అడ్డికిపావుసేరు రేటుకు అడిగేవారు. ఇక జిల్లాలు, గ్రామాల్లో అయితే నీటివసతి లేక.. పెద్దగా ధర వచ్చేదే కాదు. చాలా గ్రామాల్లో 50వేలు, 60వేలకు ఎకరం భూమి వచ్చేది. ఇపుడు అలాంటి వాతావరణం రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనూ లేదు. పట్టణాల్లో అసలే లేదు. ఆరేండ్ల క్రితం నారాయణఖేడ్‌ లాంటి ప్రాంతాల్లో 50నుండి 60వేలకే ఎకరం వచ్చే పరిస్థితి ఉండగా, ఇపుడు రూ.12 నుండి 15లక్షల దాకా ధర పలుకుతోంది. పాలమూరులోనూ ఇదే సీన్‌. ఇంతకు రెట్టింపు ధరలు పలుకుతున్నాయి.
ఒకప్పుడు భూముల ధరలు పెరిగాయంటే.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఐటీ పరిశ్రమ ఉందనో.. కొత్త బైపాస్‌ వచ్చిందనో.. పరిశ్రమ వచ్చిందనో ఆ పరిసర ప్రాంత భూముల విలువ పెరిగేది. కానీ రాష్ట్రమంతా కూడబలుక్కన్నట్లు పెరగడం వెనుక స్పష్టంగా ప్రభుత్వ విజన్‌ ఉంది. సీఎం కేసీఆర్‌ ఎంతో మథనం చేసి రూపొందించిన వ్యూహం ఉంది. దార్శనికత ఉంది. మొత్తం సమాజాన్ని మార్చాలన్న చిత్తశుద్ధి ఉంది. ఆ పరిశ్రమ, విజనే.. ఆర్థిక సంక్షోభాలను అధిగమించేలా చేసింది. కరోనాను తట్టుకుని తెలంగాణ నిటారుగా నిలబడే శక్తినిచ్చింది. ఏటా లక్ష కోట్ల విలువైన పంట పండేలా చేసింది. లక్ష రూపాయల విలువ కూడా లేని భూములకు 20 లక్షలు.. 30 లక్షలు ధర తీసుకొచ్చింది. అన్నింటికీ మించి భూమి విలువ అందరికీ తెలిసేలా చేసి.. ఆ భూమితో ముడిపడ్డ రంగాల వృద్ధికి, తద్వారా తెలంగాణ వృద్ధికి.. బాటలు పరిచిన సీఎం విజన్‌ చూసి దేశంలోని దిగ్గజ ఆర్థికవేత్తలే అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement