Wednesday, January 29, 2025

KCR : రేపటి నుంచి కేసీఆర్‌ బస్సు యాత్ర..

హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపు ప్రారంభం కానున్నది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సుయాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

యాత్ర పొడవునా భారీ జన సందోహం రానుండటంతో రోడ్‌ షోల్లో ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం ఏర్పడకుండా వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. 100 మందికి పైగా వలంటీర్లు కేసీఆర్‌ యాత్ర పొడవునా వాహన శ్రేణి వెంట ఉంటారు. తొలిరోజైన బుధవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ క్యాడర్‌, నేతలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తొలి రోడ్‌షోలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement