Saturday, November 23, 2024

బిసిల కోసం కొత్త ప‌థ‌కం – కెసిఆర్ అప‌ద్బంధు…

హైదరాబాద్‌, : బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ‘కేసీఆర్‌ ఆపద్బంధు’ పేరుతో అర్హులైన బీసీలకు అంబులెన్స్‌లు అందజేసే పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ”కేసీఆర్‌ ఆపద్బంధు” పథకాన్ని ప్రారం భించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. శుక్రవారం తన నివాసం నుంచి ఆన్‌లైన్‌లో బీసీ సంక్షేమంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ మహిళా స్వాలంబన కోసం రూ. 100 కోట్లతో మరో నూతన పథకాన్ని ప్రారంభించను న్నట్లు వివరించారు. గ్రామీణ మహిళలకు నిఫ్ట్‌లో శిక్షణ అందించి 25 మంది సభ్యులను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కుట్టుమిషన్లతో పాటు అన్నిరకాల కుట్టు యంత్రాలు అందిస్తామని మంత్రి తెలిపారు. వీటితో పాటు బీసీలకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, రజకులు, నాయిబ్రాహ్మణులు, కుమ్మరులు, మేద రులు, విశ్వ బ్రాహ్మణులు, సగరులు, వడ్డెరులతో పాటు వివిధ కుల వృత్తుల వారికి ప్రతి కులంలో 5 వేల మంది చొప్పున వృత్తి పని ముట్లు అందించే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రూ.300 కోట్లతో 50 వేల మంది బీసీ యువతకు ఏసీ రీపేర్‌, టూ వీలర్‌ రిపేరు తదితర వృత్తి శిక్షణలు ఇవ్వడంతో పాటు పనిముట్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు రూపొందిస్తున్నామని మంత్రి కమలాకర్‌ వివరించారు. ఇప్పటికే ఎలాంటి గుర్తింపునకు నోచుకొని 17 కులాలను బీసీల్లో చేర్చడమే కాకుండా 75 బీసీ కులాలకు 40 ఆత్మగౌరవ భవనాలను 82.30 ఎకరాల్లో రూ. 95 కోట్లతో నిర్మించనున్నామని, వాటి కోసం రూ. 10 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి కమలాకర్‌ తెలిపారు.
స్టడీ సెంటర్ల ఏర్పాటు
విద్యాపరంగా బీసీ సంక్షేమ హాస్టళ్లలో డిజిటల్‌ క్లాస్‌లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 281 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణకు గతం కంటే అదనంగా రూ.75 కోట్లు ఇస్తూ రూ.680 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధుల ద్వారా 2021-22 విద్యా సంవత్సరం నుంచి 119 జూనియర్‌ కాలేజీలు ఏర్పాటుచేసి 9,520మంది విద్యార్థులను చేర్చుకుంటున్నామన్నారు. కరోనా సమయంలోనూ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అందుకుగాను 11 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి గ్రూప్‌ 1, 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.1850 కోట్లు కేటాయించామని, గతం కంటే అదనంగా రూ.500 కోట్లు కేటాయించామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 3.50 లక్షల మంది వదువులకు రూ.3,353 కోట్లు ఖర్చు చేశామని మంత్రి గంగుల వివరించారు.
రైతు పండించే ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు 6,408 కేంద్రాలు, 20 కోట్ల గన్నీ సంచులను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వివరిం చారు. 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనాగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అందుకవసరమయ్యే రూ.20 వేల కోట్ల కోసం పౌరసరఫరాల సంస్థకు బ్యాంకు గ్యారంటినీ ప్రభుత్వమే ఇస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఉన్నతాధికారులు అలోక్‌ కుమార్‌, మల్లయ్య బట్టు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement