హైదరాబాద్ : నూతన ఆవిష్కర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. హైదరాబాద్‌లో సోమవారం కవితను కలిసిన మానస నూతన విధానంలో ఇండ్లను నిర్మిస్తున్న తీరును ఆమెకు వివరించారు. మానస రెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.
సిమెంటు పైపుల్లో మైక్రో ఇళ్లు..
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన పేరాల మానస రెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది. సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదివింది. వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. ఆ అనుభవంతో తెలంగాణ ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది. రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇల్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నిర్మించేందుకు వీలుంటుంది.