హైదరాబాద్, ఆంధ్రప్రభ : కన్న తలిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, వారి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఓ యువకుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని తలిదండ్రులు సత్యనారాయణ, సత్యవతిలు గ్రామంలోనే ఉంటున్నారు. కాగా, తన తలిదండ్రులు గ్రామంలోని ఆస్తులను అమ్మేసి తనను డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని శ్రీనివాస్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాను బ్యాంక్‌లోన్ తీసుకుని ఎంసీఏ చదివి ఉద్యోగం సంపాదించుకున్నానని, పార్ట్‌టైం జాబ్‌లు చేసుకుంటూ కష్టపడి తీసుకున్న రుణాన్ని తీర్చానని పేర్కొన్నాడు.
ఊర్లో ఉన్న ఆస్తులు అమ్మేసిన తలిదండ్రులు అప్పులు అయ్యాయని చెప్పి తన వద్ద గత ఏడాది రూ. 22 లక్షలు తీసుకున్నారన్నాడు. రూ.22 లక్షలను పెద్దల సమక్షంలో ఇచ్చానని, ఇప్పుడు ణరో రూ.15 లక్షలు ఇవ్వాలని తలిదండ్రులు వేధిస్తున్నారని వాపోయాడు. వారి వేధింపులతో తనకు బ్రెయిన్ టీబీ వచ్చిందని, తనను మానసికంగా వేధిస్తున్న తలిదండ్రులపైనా స్థానిక ఎల్లంపేట సర్పంచ్, మరిపెడ పోలీసులపైనా చర్యలు తీసుకుని తనకు రక్షమ కల్పించాలని శ్రీనివాస్ కమిషన్‌కు వేడుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.