హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధానమైన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 850కి పైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను అందిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. వినియోగదారులకు అత్యుత్తమ ట్రూ 5జీ సేవలను అందించేందుకు జియో కట్టుబడి ఉందని తెలిపింది.
జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో వెల్‌కమ్ ఆఫర్ కింద 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను వినియోగదారులు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కీలక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యాసంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు హాస్పిటల్స్ హోటల్స్ రెస్టారెంట్లు ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థ ల్లో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
నగరాలు, పట్టణాలకు తగ్గరగా ఉన్న గ్రామాల్లోనూ జియో 5జీ కనెక్టివిటీతో లబ్ది పొందవచ్చని రిలయన్స్ తెలిపింది. తెలంగాణలో జియో ట్రూ 5జీ సేవలను విస్తరించడం పట్ల జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు ట్రూ 5జీ సేవలను అందించాలన్న లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతుందన్నారు.