హైదరాబాద్ : మూడు వందల పైచిలుకు పేజీల్లో అనేక ఆర్షవిద్యలు, పరమ రుషుల స్తోత్రాలు, సౌందర్య భక్తి సొగసుల భాషతో ఆకట్టుకునే వ్యాఖ్యాన వైఖరీ దక్షతల అంశాలు నిండిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వసంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీలలిత విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవ గ్రంథాన్ని జంటనగరాల్లో అనేక సాంస్కృతిక సారస్వత సినీ రాజకీయరంగాల ప్రముఖులు, ఈ మహాగణపతి నవరాత్రుల ఉత్సవ సందర్భాల్లో జరిగే అనేక వేడుకల్లో ఉచితంగా పంచడంతో ఈ అమృతమయ గ్రంథ రచయిత శ్రీనివాస్ అందించిన విలువైన ఆర్ష ధార్మిక అంశాలపై ప్రశంసలు వర్షిస్తున్నారు.
ఒకవైపు దైవీయ చైతన్యపు కార్యక్రమంలో ప్రఖ్యాత ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ అమ్మవారి అనుగ్రహంగా పురాణపండ మంత్రమయ అక్షరకలశాల్ని పంచుతుండగా, భక్తుల పారవశ్యానికి అంతు లేదనే చెప్పాలి. మరోవైపు భారతీయ జనతాపార్టీ తెలంగాణా అధ్యక్షురాలు కొత్తూరి గీతామూర్తి అనేక దేవాలయాలు, అనేక ముఖ్య కార్యాల్లో తానే స్వయంగా ఈ శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవ గ్రంథాన్ని వందల కొలది మహిళలకు పంచుతూ అభినందనలు అందుకుంటుండగా.. ఇంకొక వైపు ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాదర్బార్ అధ్యక్షులు సుబ్బారావు సమర్థవంతమైన పురస్కారాల వేడుకలో శ్రీభారతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి చింతలపాటి సురేష్, కళాకారులకందరికీ పంచి ఆకట్టు-కున్నారు.
ఈ దైవీయ గ్రంథాల వితరణ వెనుక దైవబలానికి ఉడుతాభక్తి తోడుగా కిమ్స్ వైద్య మహాసంస్థల చైర్మన్ బొల్లినేని క్రిష్ణయ్య, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, సీనియర్ ఐఏఎస్ అధికారులు కేవీ.రమణాచారి, యాదాద్రి డెవలప్ మెంట్ అథారిటీ- చైర్మన్ కిషన్ రావు వంటి ప్రముఖులు ఆర్థిక హార్దిక సౌజన్యాన్ని అందించడాన్ని రసజ్ఞులు శహభాష్‌గా పేర్కొనడం పురాణపండ అవిశ్రాన్త కృషికి నిదర్శనమని చెప్పాలి. ఇటీవల రవీంద్రభారతి, త్యాగరాయ గానసభల్లో జరిగిన అనేక వేడుకల్లో పురాణపండ గ్రంధాల పవిత్ర సందడికి ప్రేక్షకులు, రసజ్ఞులు, పాఠకులు చప్పట్లు కొట్టిన తీరే పురాణపండ అంకిత భావాన్ని, అద్భుత ప్రతిభను తెలియజేస్తోందని పలువురు బాహాటంగా చెబుతున్నారు.