పీడిత, దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్ నందు గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు అనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. బ్రిటిష్ వలసవాద సంకెళ్లు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని ఆయన విద్యార్థి దశలోనే భావించేవారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.