Tuesday, November 26, 2024

ప్రభుత్వమే మాంసం కొట్లు నిర్వహించడం అన్యాయం.. సాయిబాబా

ఆరె కటిక కులవృత్తిని ప్రభుత్వం లాక్కొని మాంసం కొట్లు నిర్వహించడం అన్యాయమని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. ఆరెకటిక అభివృద్ది సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్ పి.సాయిబాబా ను జిల్లా పార్టీ కార్యాలయంలో కలిసి ఆరె కటికలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసారు. సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ…. ఆరెకటిక కులవృత్తిని తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తుందని కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆరె కటికల గొంతు నుమిమే విధంగా మటన్ షాపులు, కర్రీ పాయింట్స్ ప్రారంభిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించి, సజావుగా నడపలేక చివరికి ప్రభుత్వం మటన్ క్యాంటిన్లు, కర్రీ పాయింట్సు పెట్టడం రాష్ట్ర దుస్థితిని తెలియజేస్తుందన్నారు.

ఇప్పటికే కటికల కులవృత్తిలో సాయబులు, ఇతరులు ఎక్కువయి, ఆరె కటికల జీవనం దుర్బరంగా మారిందన్నారు. ఇప్పటికే మేకలు, గొర్ల ధరలు పెరిగి కులవృత్తిని సాగించలేక 8 మంది ఆరెకటికలు ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆరె కటికలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని, అధికారంలోకి రాగానే అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలి ఇప్పుడు ప్రభుత్వ మాంసం షాపులు, కర్రీ పాయింట్లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న – ఏరు దాటాక బోడి మల్లన్నఅన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఆరె కటికలను బిసి-డి కేటగిరి నుండి బిసి-ఎ కు మార్చాలని, ఆరె కటికలకు 90శాతం సబ్సిడీతో రుణ సదుపాయంతో గొర్రెల పంపిణీ చేసి, మటన్ షాపులకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గౌడ్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రచారి, కెడి. దినేష్, గోపాల్, జోగిందర్ సింగ్, సత్యనారాయణ, శ్రీనివాస్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement