ఆంధ్రప్రభ, మల్కాజిగిరి: డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ అన్నారు. ఘట్‌కేసర్‌లో గురువారం జరిగిన నేర సమీక్షలో మాట్లాడారు. ఈ సమావేశంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేయాలని సీపీ తరుణ్ జోషీ చెప్పారు. దందా చేసే వారిపై పీడీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పారు.
డ్రగ్స్ వాడకంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని సీపీ పేర్కొన్నారు. యువతలో మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్న నేపథ్యంలో పలుకేసుల దర్యాప్తు, విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై పోలీసు అధికారులు, సిబ్బంది తెలుసుకుని ఉండాలన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, క్రయవిక్రయాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల మీద సీపీ జోషీ అధికారులకు పలు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుఖానాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం, లోగో హోలోగ్రాం వంటి వాటిని పరిశీలించాలని, వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే షాపుల్లో అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.