Saturday, November 23, 2024

హైద‌రాబాద్ లో ఐపిఎల్ బెట్టింగ్ దందా … చేతులు మారుతున్న వంద‌ల కోట్లు..

హైదరాబాద్‌, : ఐపీఎల్‌ సీజన్‌ మొదలైతే చాలు క్రికెట్‌ ఫీవర్‌కు తోడు బెట్టింగ్‌ దందా వందలకోట్లలో జరుగుతోంది. వందకు వెయ్యి, వెయ్యికి పదివేలు, పదివేలకు లక్ష ఇలా ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాలో మొదట సరదాగా పాల్గొంటూ.. తర్వాత సర్వం కోల్పోతున్నారు. బెట్టింగ్‌ దందా కారణంగా కుటుంబసభ్యులకు తెలియకుండా అప్పులుచేసి, తప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడ్డ యువకులు కూడా ఉండడం ఈ దందా విశ్వ రూపానికి అద్దంపడుతోంది. ఆన్‌లైన్‌లోనే ఐపిఎల్‌ బెట్టింగ్‌ నిర్వహించే యాప్‌లు వందలసంఖ్యలో ఉండగా, వాట్సాప్‌ గ్రూప్‌లు కూడా రారమ్మని పిలుస్తుంటాయి. ఇక కొవిడ్‌ కారణంగా విద్యార్ధులు, యువత వద్ద ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం మొబైల్‌ ఫోన్లు చేతుల్లో ఉంటుండగా, సరదా.. అత్యాశలతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసి రూ.16కోట్లు స్వాధీనం చేసుకోగా, మొబైల్‌ యాప్‌ల ద్వారానే ప్రధానంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ జోరు మరింత పెరిగింది. కూకట్‌ పల్లి, మణికొండ, కోకాపేట, ఎల్బీనగర్‌ వంటి సిటీలోని కొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు కేంద్రంగా తెలంగాణ, ఎపిలలో ఈ దందా సాగుతోంది. టాస్‌ వేసింది మొదలు బంతి బంతికి బెట్టింగ్‌, బ్యాట్స్‌మెన్‌ బౌండరీ కొడతాడా, బౌలర్‌ వికెట్‌ తీస్తాడా? ఫలానా ఓవర్‌లో ఎన్ని పరుగులు ఇస్తాడు? బ్యాట్స్‌మెన్‌ ఎలా అవుట్‌ అవుతాడు. టాస్‌ వేసినప్పటి నుంచి చివరి వరకు బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్‌కు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా కాలేజీ యువత బెట్టింగ్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటోంది. కొందరు ఈజీ మనీకి అలవాటుపడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్‌ ప్రేమికుల వ్యసనాన్ని బలహీనతలను ఆసరాగా చేసుకుని బెట్టింగ్‌ ముఠాలు విచ్చల విడిగా పందేలకు పాల్పడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశతో.. చేతిలో ఉన్న చిన్నపాటి డబ్బును కూడా పోగొట్టుకుంటున్న కొందరు.. రోడ్డున పడుతున్నారు. కొందరు సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు హైదరాబాద్‌లో అనేకం జరిగాయి. ప్రతి ఏడాది వందల కోట్లలో బెట్టింగ్‌ జరుగుతోంది. టాస్‌ నుంచి మ్యాచ్‌ ఫలితం వరకు.. ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల కౌంట్‌, స్కోర్‌ ప్రెడిక్షన్స్‌ ఇలా బంతి బంతికి వందలు, వేలు, లక్షల వరకు పందేలు జరుగుతుంటాయి. ఐపీఎల్‌ రాకతో సాయంత్ర మైందంటే చాలు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యవహారంలో బెట్టింగ్‌లో పాల్గొన్న వారు నష్టపోతుండగా నిర్వాహకులు 10 నుంచి 26 శాతం కమీషన్‌ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని తెలుస్తోంది. ఈసారి బెట్టింగ్‌కు వాట్సాప్‌, ఇతర యాప్లను విని యోగిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ నిర్వాహకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లక్షల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. గతంలో కేవలం మహానగరాలకే పరిమితమైన ఈ దందా.. పల్లెలకూ విస్తరించింది.
బెదిరింపులు.. వసూళ్ళు
ఆన్‌లైన్‌ పద్దతిలో గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యాప్‌ల ద్వారా మనీ ట్రాన్స్‌ ఫర్‌ జరుగుతుండగా.. మరికొందరు ఢిల్లిd, దుబాయ్‌ కేంద్రంగా ఈ దందా కొనసాగిస్తూ లోకల్‌ వసూళ్ళకు గ్యాంగ్‌లను మెయింటైన్‌ చేస్తున్నట్లు తెలిసింది. నిఘా వైఫల్యంతో యధేచ్చగా ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఐపిఎల్‌ సీజన్‌లోనే రూ.500కోట్లకు పైగా ఈ బెట్టింగ్‌ వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి దందాలు నిర్వహిస్తున్న ఓ మహిళా బుకీని ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. పందెంరాయుళ్ళు.. బెట్టింగ్‌ల కోసం విభిన్న భాషను, నిక్‌నేమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. ఎస్‌ఓటి పోలీసులు సమాచారం మేరకు అక్కడక్కడా దాడులు చేస్తున్నా.. ఈ వందలకోట్ల దం దాను అడ్డుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది.
లాక్‌డౌన్‌పైనా బెట్టింగ్‌లు
మే 2నుండి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉందంటూ గత వారంరోజులుగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు సాగు తున్నట్లు సమాచారం. ఐదురాష్ట్రాల ఎన్నికలు ముగియగానే.. లాక్‌డౌన్‌ ఖాయమని ఎక్కువమంది బెట్టింగ్‌ రాయుళ్ళు పందాలు కాస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement