Friday, November 22, 2024

Manikonda: పందెం వాగు పరిశీలన.. అంబుయన్స్ కోర్ట్ యార్డ్ నుంచి నాలా వరకు..

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలన
‘‘ఆంధ్రప్రభ’’ కథనంతో యంత్రాంగంలో కదలిక
మరో మూసీగా మారనుందంటూ హెచ్చరిక
అధికారుల రాకతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి
80 మీటర్ల డ్రైనేజీ పైప్ కు అనుమతి.. 850 మీటర్ల తవ్వకం
లోతుగా పరిశీలిస్తే ఇంకెన్ని అంశాలు బయటపడతాయో ?
సమస్యను గుర్తించిన ‘ఆంధ్రప్రభ’కు స్థానికుల ప్రశంసలు

మణికొండ : పందెం వాగు నాలా.. మొత్తం మణికొండ పురపాలక సంఘానికి ఏకైక మురుగు నీరు పారే నాలా. ఇలాంటి నాలాలోకి ఏకంగా 850 భారీ విలాసవంతమైన ఫ్లాట్ల మురుగునూ కలిపేసే ప్రయత్నం జరుగుతోంది. అది కూడా ప్రధాన మౌలిక సదుపాయాలైన మంచి నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయకుండానే బహుళ అంతస్తుల సముదాయాలకు అనుమతులిచ్చారు. ఇదే జరిగితే పందెం వాగు మరో మూసీ అవుతుంది. ఈ విషయమై హెచ్చరిస్తూ.. ‘‘పందెం వాగు..మరో మూసీ’’ అంటూ ‘‘ఆంధ్రప్రభ’’ రెండు రోజుల కిందట కథనాన్ని ప్రచురించింది. దీంతో మున్సిపల్ యంత్రాంగం కదిలింది. మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మణికొండకు వచ్చారు.

ఏం జరుగుతోంది అసలు..
శ్రీనివాస్ రెడ్డి.. తానాషా నగర్ హుడా కాలనీ దగ్గర ఉన్న అంబుయన్స్ కోర్ట్ యార్డ్ బహుళ అంతస్తుల సముదాయం నుంచి ఎంప్లాయీస్ కాలనీ దగ్గర ఉన్న పందెం వాగు నాలా వరకు పర్యటించారు. అక్కడ జరుగుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఆయన వెంట మణికొండ మున్సిపల్ కమిషనర్ ధర్మపురి ప్రదీప్ కుమార్, డీఈ దివ్య జ్యోతి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

ఇలాగైతే మణికొండ మనుగడ ఎలా?
పందెం వాగు నాలాను బాక్స్ డ్రైన్ రూపంలో అభివృద్ధి చేయకుండా పెద్ద పెద్ద బహుళ అంతస్తుల సముదాయాల నుంచి వచ్చే మురుగు నీరు కలపడం ఏ మేరకు సమంజసం అంటూ ది సిటిజన్స్ కౌన్సిల్ ఫోరం ప్రతినిధులు.. మున్సిపల్ అధికారులకు వివరించారు. ఇప్పటికే వర్షాకాలంలో పందెం వాగు నాలా పొంగి పలు కాలనీలు మునిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా బహుళ అంతస్తుల సముదాయాలకు అనుమతులు ఇవ్వొద్దని వేడుకున్నారు. దీంతో రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తనకు సమస్య మొత్తం అర్థమైందని.. విషయాన్ని పై అధికారులకు నివేదిస్తానని చెప్పారు. సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, కార్యదర్శి ఆరిఫ్, ఉప కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, కోశాధికారి దిలీప్, తానాషానగర్ హుడా కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్, ఎంప్లాయీస్ కాలనీ అధ్యక్షుడు పెంటారెడ్డి, తదితరులు మున్సిపల్ అధికారులకు నివేదించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

కోర్టుకెళ్తే.. మేమూ వెళ్తాం..
మున్సిపల్ అధికారులు పందెం వాగు నాలా పరిశీలన సందర్భంగా కొంత వాడివేడి వాతావరణం కనిపించింది. స్థానికులు ప్రస్తుత డ్రైనేజ్ వ్యవస్థ గురించి రీజనల్ డైరెక్టర్ కు వివరిస్తుండగా.. అంబుయన్స్ బిల్డరు కోర్టుకు వెళ్లి పనులకు ఆటంకం కలిగించకుండా స్టే తెచ్చుకుంటే ఏం చేస్తారు? అనే ప్రశ్న వచ్చింది. దీంతో తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామని స్థానికులు కుండబద్దలు కొట్టారు.

అక్రమాల పైప్ లైన్..
మణికొండ మున్సిపాలిటీలో రోడ్డు కటింగ్ పర్మిషన్ 80మీటర్లు మాత్రమే. కానీ, అంబుయన్స్ యార్డ్ డ్రైనేజ్ పైప్ లైన్ కలిపే విధానం చూస్తే 850 మీటర్లుగా స్పష్టం అవుతోంది. అంటే అనుమతి కంటే పది రెట్లు అన్నమాట. దీన్నిబట్టే ఉల్లంఘనల స్థాయి ఏమిటో తెలిసిపోతోంది.

రోడ్లే బాగోలేవు.. ఆపై తవ్వకమా..
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ మధ్య కాలంలోనే ఓ రోడ్డు వేశారు. దానికి కూడా అంబుయన్స్ యార్డ్ డ్రైనేజీ పైప్ లైన్ కోసం తవ్వేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమేననే అభిప్రాయం వస్తోంది. దీంతో డీఈ దివ్యజ్యోతి కల్పించుకున్నారు. ఇప్పుడు వేస్తున్న పైపుల కారణంగా గతంలో ఉన్న పైపులు దెబ్బతింటాయని ఉన్నతాధికారులకు వివరించారు.

‘‘ఆంధ్రప్రభ’’కు అభినందనలు..
పందెం వాగు ఉనికికి ఉన్న ముప్పును వివరిస్తూ కథనం ప్రచురించడమే కాక.. అధికారులు కదిలివచ్చేలా చేసిన ఆంధ్రప్రభకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో తాము ఎదుర్కొనే ఇబ్బందిని సరైన సమయంలో వెలుగులోకి తెచ్చారని పలు కాలనీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement