Friday, November 22, 2024

సిద్స్‌తో సంచలనాలను సృష్టిస్తోన్న హైదరాబాదీ కిశోర్‌ ఇందుకూరి

హైదరాబాద్‌ నగరంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కిశోర్‌ సిద్స్‌ ఫార్మ్‌ ద్వారా ఇప్పుడు క్షీర విప్లవాన్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సాధారణ మధ్యతరగతి యువకుడు కిశోర్‌. చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ఆసక్తి కానీ తల్లిదండ్రుల మాట తీయలేక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీఎస్‌సీ కెమిస్ట్రీ, యూనివర్శిటీ ఆఫ్‌ మసాచుట్స్‌లో పాలీమర్‌ సైన్స్‌లో డాక్టరేట్‌ చేశాడు. ఆ తరువాత అక్కడే ఇంటెల్‌ సంస్ధలో ఉద్యోగమూ చేశాడు. కానీ వ్యవసాయం పట్ల ఆసక్తి అతన్ని అక్కడ నిలువనీయలేదు. భార్య హిమ ప్రోత్సాహం కూడా ఉండటం, మాతృభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్పం వెరసి సిద్స్‌ ఫార్మ్‌కు అంకురార్పణ జరిగింది. సిద్స్‌ పాలులో యాంటీబయాటిక్స్‌ ఉండవు, నిల్వ కారకాలూ ఉండవు. కల్తీ లేదు. హార్మోన్లు కూడా ఉండవు. సిద్స్‌ పాలు ప్రతి రోజూ 45 రకాల పరీక్షలను చేసుకుంటాయి. త్వరలోనే ఈ పరీక్షల సంఖ్యను 66 అంశాలలో పరీక్షలను చేయనున్నామని చెబుతున్నారు. తమ విస్తరణ ప్రణాళికలను గురించి కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ… ప్రీమియం పాల మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి నగరంలోనూ వీటికి మార్కెట్‌ ఉందన్నారు. కానీ ముందుగా తాము హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆ తరువాత దక్షిణ భారతదేశం, అందునా బెంగళూరులో విస్తరించి అనంతరం భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం విస్తరణ పథంలో ఉన్న సిద్స్‌ ఫార్మ్‌ దానికి సంబంధించి నిధుల సమీకరణ ప్రారంభించిందన్నారు. దాదాపు రూ.75 కోట్ల నిధులను సమీకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement