Saturday, November 23, 2024

TS | ఆర్టీసీ సిబ్బందిపై ఆగని దాడులు.. డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు..

టీఎస్ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ట్యాంక్ బండ్ పై ఆదివారం రోజు రాత్రి ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీం అనే ఇద్దరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు.

క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టడంతో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగగా.. డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయని అన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.

పదే పదే హెచ్చరిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. గతంలో ఇలాగే ఓ యువతి సిబ్బందిపై దాడి చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అయినా కొంతమంది కావాలనే ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ సిబ్బంది మానసిక ధైర్యాన్ని దెబ్బ తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సిబ్బందిపై దాడి చేస్తే చట్టపరంగా చర్యలుంటాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement