భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. రక్షణ, సైనిక దళాలకు అవసరమైన అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి పేరు ప్రఖ్యాతులు గడించిన కారకల్ ఇంటర్నేషనల్ సంస్థతో సాంకేతికత బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ సంస్థ. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ సంస్థ భారతదేశ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంటోంది. ఈ సందర్భంగా ఐకామ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.సుమంత్ మాట్లాడుతూ… భారత రక్షణ పరిశ్రమ సార్వభౌమత్వ అభివృద్ధిలో ఈ సాంకేతిక ఒప్పందం కొత్త అధ్యాయంగా చెప్పవచ్చన్నారు. భారత రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధి చేయడానికి, దేశ రక్షణ ఆశయాలకు సహాయం చేయడానికి కారకల్ టెక్నాలజీ ఒప్పందం ఎంతో దోహదపడుతుందన్నారు.
దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా ఆయుధాల సరఫరాలో అడ్డంకులను అధిగమించేందుకు భారత ప్రభుత్వం చూపిన శ్రద్ధ, చొరవను ఆయన ప్రశంసించారు. ఆయుధాల తయారీకి ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం, రక్షణ పరికరాల తయారీలో స్వదేశీకరణకు భారత ప్రభుత్వం తీవ్రంగా చొరవ చూపిందన్నారు. చిన్న ఆయుధాల ఉత్పత్తిలోకి ప్రవేశించడం ఐకామ్‌కు గర్వకారణమని సుమంత్ అభిప్రాయపడ్డారు. భారతీయ మార్కెట్లో సహకారం కోసం ఐకామ్తో ఈ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు కారకల్ సీఈఓ హమద్ అల్ అమెరి అన్నారు. ఈ ఒప్పందంపై సంతకం కారకల్ కీలక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.