దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ , టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)కి రూ.1,200 కోట్లు విరాళంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.ఈ నిబద్ధతను తెలియజేసేందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ టీఎంసీ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఛైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది మాట్లాడుతూ… ఐసిఐసిఐ బ్యాంక్‌కు దేశ సేవ పరంగా సుదీర్ఘ వారసత్వం ఉందన్నారు. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనోపాధికి నైపుణ్యాభివృద్ధి, అందుబాటులో ఆరోగ్య సంరక్షణ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లలో వివిధ కార్యక్రమాల ద్వారా పౌరుల శ్రేయస్సును మెరుగు పరచడానికి ఐసీఐసీఐ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఐసీఐసీఐ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 2.6 మిలియన్లకు పైగా చెట్లను నాటింది, 5000 గ్రామీణ పాఠశాలలు, వాటర్‌షెడ్ నిర్మాణాల వద్ద సంవత్సరానికి 17.1 బిలియన్ లీటర్ల వర్షపు నీటిని సేకరించే సామర్థ్యాన్ని సృష్టించిందన్నారు. గ్రామీణ పాఠశాలలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసిందన్నారు. నైపుణ్య కార్యక్రమం ల ద్వారా 2.9 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూర్చిందన్నారు.
టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎ.బద్వే మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి అతిపెద్ద సీఎస్ ఆర్ కార్యక్రమాల్లో ఒక దానిని ప్రారంభించిన ఐసీఐసీఐ ఫౌండేషన్‌కు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నవీ ముంబై, విశాఖపట్నం ముల్లన్‌పూర్‌లోని టాటా మెమోరియల్ సెంటర్‌లోని మూడు ఆసుపత్రులలో చేర్చబడుతున్న మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలోని ప్రజలకు అధిక సబ్సిడీ ఖర్చులతో సకాలంలో, అధిక-నాణ్యత చికిత్సను అందిస్తాయన్నారు. అధునాతన క్యాన్సర్ కేర్‌ను ఇంటి దగ్గరే అందించడం చాలా కీలకం, తద్వారా ఈ ప్రాంతం నుండి ఎక్కువ మంది ప్రజలు ఇటువంటి చికిత్సలను పొందటం ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు.