రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేయడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సమిష్టి బాధ్యత ఉందని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ ఐఏఎస్ అన్నారు. గురువారం హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. హెచ్ఎండిఏలో పనిచేయడం ఉద్యోగులు అదృష్టంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న బాధ్యతలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెంచుతున్న గ్రీనరీ వల్ల అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం అందుకు నిదర్శనమన్నారు. గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగంలోని అంశాలను చదివి మననం చేసుకోవాలని సంతోష్ ఉద్యోగులకు సూచించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హరిత విప్లవానికి నాంది పలికిందని, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు నాయకత్వంలో, ఎంఏయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండిఏ పెంచిన గ్రీనరీ వల్ల వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో ప్రపంచఖ్యాతి దక్కిందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా- ఈ ఈవెంట్, ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు, అతిపెద్ద సైకిల్ ట్రాక్ వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట, హెచ్ఎండిఏ ప్రాధాన్యత మరింతగా పెరగనున్నదని ఆయన వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ బి ప్రభాకర్ ఐఎఫ్ఎస్, హెచ్ఎండిఎస్ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ప్లానింగ్ డైరెక్టర్ శివ శరణప్ప, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డి చంద్రారెడ్డి, ఓఎస్డి రాంకిషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డిఎస్పి రమణ గౌడ్ లతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.