హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్, రీసైక్లింగ్ కంపెనీ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రత్యేక ఇంజనీరింగ్ కంపెనీ టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారతీయ రైల్వేలకు తమ ఉద్గార లక్ష్యాలు చేరుకోవటం, ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో సహాయపడుతూ ప్రపంచ స్థాయి అల్యూమినియం రైల్ వ్యాగన్‌లు, కోచ్‌లను అభివృద్ధి చేయడం, తయారు చేయడం చేయనున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాయ్ మాట్లాడుతూ… భారతదేశం మొట్టమొదటి అల్యూమినియం రేక్‌ను ప్రారంభించడంతో, అల్యూమినియం రేక్‌లు అందించే అధిక పేలోడ్, గణనీయమైన సీఓ2 తగ్గింపు ప్రయోజనాలను తాము ప్రదర్శించామన్నారు. ఈ భాగస్వామ్యం సరకు రవాణా పరిశ్రమ, ప్రయాణీకుల మొబిలిటీ కోసం విలువ ప్రతిపాదనను పెంపొందించడంలో తమ పాత్రను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ ఇంద్రజిత్ ముఖర్జీ మాట్లాడుతూ… ఈ విలువైన భాగస్వామ్యం వినూత్నమైన, స్థిరమైన ఉత్పత్తులను రూపొందించడంలో పరిశ్రమ కార్బన్ పాదముద్రను తగ్గించడం, సానుకూల పర్యావరణ ప్రభావాన్ని పెంచడం పట్ల తమ నిబద్ధతను మరింత బలోపేతం చేయడంలో చాలా దోహదపడుతుందన్నారు. టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్.డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్త ముఖర్జీ మాట్లాడుతూ… తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సమర్థవంతమైన రోలింగ్ స్టాక్‌ను పరిచయం చేయడంలో భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడంలో ఈ భాగస్వామ్యం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.