కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్): మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్, గాజులరామరం జంట సర్కిల్ ల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రతి డివిజన్ వార్డ్ కార్యాలయాలలో మాన్సూన్ డిసాస్టర్ టీం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉంటూ విపత్తులు సంభవించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
జంట సర్కిళ్ల పరిధిలోని అన్ని డివిజన్, వార్డు కార్యాలయాల్లో వర్షాకాలంలో ఎదుర్కోవాల్సి సమస్యలపై తక్షణం స్పందించేలా డిజాస్టర్ టీమ్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. ప్రతి కాలనీ, బస్తీలలో వరద నీరు నిల్వ ఉండకుండాఎప్పటికప్పుడు రోడ్లు, నాలాలను శుభ్రపరచాలని చెప్పారు. అసంపూర్తిగా మిగిలిఉన్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
రోడ్లూ, డ్రైనేజీలు, నాళాలు ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని ముఖ్యంగా డ్రైనేజీ మ్యాన్ హొల్స్ మూతల విషయంలో ఎంతో కేర్ గా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏ ఉపద్రవం సంభవించినా ఎదుర్కొనేందుకు మాన్సూన్ టీమ్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక.. వర్షాకాల సమస్యలపై పిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 040 – 21111111 ఏర్పాటు చేసినట్టు అధికారులు ఎమ్మెల్యేకి తెలిపారు. సమావేశంలో కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, టౌన్ ప్లానింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.