హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్ 15) పురస్కరించుకొని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్‌ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, వారితో వచ్చేవారికి అధికారులు సూచనలు చేశారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకు రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.
మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని పార్కింగ్, డిపార్చర్, అరైవెల్‌లో సీఐఎస్‌ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు అందరూ గమనించి సహకరించాలని అధికారులు కోరారు.