యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు విజయవంతంగా ప్రపంచంలోనే తొలిసారిగా పంది గుండెను మనిషికి అమర్చడం ఆధునిక వైద్యశాస్త్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయమని కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ సందీప్ అత్తావర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… అవయవాల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అవయవ మార్పిడి చికిత్సలకు ఇది ఒక ఆశాదీపం లాంటిదన్నారు. కొన్ని సంవత్సరాల పాటు చేసిన పరిశోధనల ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ప్రతియేటా అవయవాలు పాడై లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటారన్నారు. తమకు సరిపడ అవయవదాతలు దొరక్క వారిలో చాలామంది మరణిస్తుంటారు కూడా. ఇలాంటి ఇబ్బందులతో తీవ్రంగా బాధపడేవారికి, మరణానంతరం అవయవదానాలు చేసేవారి నుంచి వారికి సరిపోయే అవయవం దొరకడమే ఏకైక పరిష్కారమన్నారు.
అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తుదిదశ గుండె వైఫల్యంతో ఒక్క అమెరికాలోనే 50వేల మంది బాధపడుతున్నారు. వారికి గుండెమార్పిడి అవసరం. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచే గుండె సేకరిస్తున్నాం. కానీ బీటింగ్ హార్ట్ కావాలంటే కేవలం 4వేలు మాత్రమే ఉన్నాయన్నారు. దీనివల్ల అందుబాటులో ఉన్న ఇతర సజీవ అవయవాల కోసం గాలింపు మొదలైంది. ఈ సమాచారాన్ని భారతదేశానికి అన్వయిస్తే, ఇక్కడి జనాభాను బట్టి, ఇక్కడి వ్యాధి తీవ్రతలను బట్టి ఈ అంకెలు కనీసం ఆరు రెట్లు ఎక్కువ ఉంటాయన్నారు. ప్రస్తుతం మన దేశంలో అవయవదానాలు ఏడాదికి కేవలం వెయ్యి మాత్రమే ఉన్నాయన్నారు. చింపాంజీలు, బబూన్లు మనకు మంచి వనరులు కావచ్చు కానీ నైతికంగా, వైద్యపరంగా, శాస్త్రీయంగా ఉన్న కారణాలతో ఈ ప్రత్యామ్నాయాన్ని చూడలేకపోతున్నామన్నారు. పరిశుభ్రంగా పెంచి, జన్యుపరివర్తనం చేసిన పందులు ఈ దిశగా చాలా పెద్ద అడుగు అన్నారు. ప్రయోగశాలల్లో మార్చి, పలు జన్యువులను తీసేసి, పీఈఆర్‌వీ (పోర్కైన్ రెట్రోవైరస్) లేని పందిపిల్లల్లో మనిషికి సంబంధించిన జన్యుమార్పిడులు చేయొచ్చన్నారు. ప్రత్యేక పెంపకం, ఆహార పద్ధతులను పాటిస్తే, బయటి నుంచి వైరస్‌లు (పీఈఆర్‌వీ) వచ్చే ముప్పును మనం తగ్గించొచ్చన్నారు. అదే సహజంగా లోపల ఉండే పీఈఆర్‌వీని సీఆర్ఐఎస్‌పీఆర్-కాస్ 9 జన్యువును మార్చడం, పిండాన్ని న్యూక్లియర్ ఎడిటింగ్ చేయడం ద్వారా తీసేయొచ్చన్నారు. కాలక్రమంలో శాస్త్రవేత్తలు గుండెను కూడా 3డి ప్రింటింగ్ చేసే అవకాశముందని, అవి పూర్తిగా సురక్షితంగా ఉంటాయని, అవైతే ఇక రోగులకు ఇమ్యునోసప్రెసెంట్లు ఇవ్వక్కర్లేదన్నారు. ఇది సరైన పరిష్కారం అవుతుందన్నారు. అయితే ఈ దిశగా ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. అయితే, పూర్తిస్థాయిలో పనిచేసే అవయవాన్ని తయారుచేయడానికి పట్టే సమయం, ఖర్చు దృష్ట్యా పెద్దమొత్తంలో వీటిని అప్పుడే చేయలేమన్నారు. అప్పటివరకు మనిషి ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రత్యామ్నాయం ఉపయోగపడుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..