Sunday, January 5, 2025

HYD | సీరియల్‌ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : బుల్లితెర నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపుల కేసులో నిందితుడిని గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లిహిల్స్‌ పీఎస్‌ పరిధిలోని యూసఫ్‌గూడలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ తన పిల్లలతో కలిసి నివసిస్తోంది.

గతేడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో బత్తుల ఫణితేజతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కాగా తనకు ఇదివరకే పెళ్లైందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె పెళ్లికి నిరాకరించింది.

దీంతో బత్తుల ఫణితేజ తరచూ అసభ్యకర సందేశాలు, వీడియోలు వాట్సాప్‌ ద్వారా పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి అత్త ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడకు వెళ్లి ఆమె గురించి చెడుగా ప్రచారం చేశాడు. బాధితురాలు బత్తుల ఫణితేజ వేధింపులు భరించలేక జూబ్లిహిల్స్‌ పోలీసుకు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న నిందితుడు తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని క్షమాపణ కోరుతూ ఆమెకు సెల్ఫీ వీడియోను పంపించాడు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేసినందుకు పోలీసులు ఫణి తేజను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement