Saturday, November 23, 2024

సెలక్షన్‌ కమిటీల ద్వారా జాప్యం లేకుండా జాబ్స్……

సెలక్షన్‌ కమిటీల ద్వారా నియామకాలు
ఉద్యోగాల భర్తీలో కొత్త పంథాపై కసరత్తు
ఇక గ్రూప్‌ పోస్టులకే టీఎస్‌పీఎస్సీని పరిమితం చేసే ప్రతిపాదనలు
జాప్య నివారణ… కేసుల తలనొప్పులు లేకుండా వ్యూహాలు
ఇప్పటికే సొంతంగా రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్న విద్యుత్‌, పోలీస్‌, సింగరేణి

హైదరాబాద్‌, ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం సరికొత్త పంథాను అనుసరించే అంశంపై కసరత్తు చేస్తోంది. 50 వేల ఉద్యోగాలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన అనంతరం ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో సీరియస్‌ వర్క్‌ జరుగుతోంది. అవినీతిరహితంగా, పారదర్శకంగా పోస్టులు భర్తీచేయడం కోసం గతంలో ఉద్యోగ నియామకాలన్నీ టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించగా, కోర్టు కేసులు.. ఇత్యాదికారణాలతో అనుకున్నంత వేగంగా పోస్టుల భర్తీ జరగలేదు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టింది. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రాధాన్యతను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్‌సీకి పూర్తిస్థాయి కమిటీని నియమించక పోవడం ఈ దిశగా జరుగుతున్న చర్చల్లో భాగమేనని తెలుస్తోంది. అన్ని పోస్టులు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నిర్వహించి.. జాప్యం జరుగు తుండడం, అనుకున్న స్థాయిలో ప్రభుత్వానికి పేరు రాకపోవడంతో.. ఇందుకు భిన్నంగా పాతపద్ధతిలోనే డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్‌ కమిటీల ద్వారా పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించే అంశంపై చర్చిస్తోంది. ఇందుకు సంబం ధించిన ప్రతిపాదనలు సీఎంవోకు చేరినట్లు తెలిసింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టనుంది.
సొంత రిక్రూట్‌మెంట్లు
గతంలో గురుకులాల టీచర్‌ పోస్టులు కూడా.. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా చేపట్టగా, ఇపుడు గురుకులాలకు సంబంధించి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. పోలీసు ఉద్యోగాలకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉంది. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ సొంతంగానే జరుగుతుంది. సింగరేణిలోనూ ఇదే తరహాలో జరుగుతుంది. గతంలో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 వంటి ఉద్యోగాల భర్తీ మాత్రమే చేయగా, ఇపుడు కూడా అదే పద్ధతిలో పరిమితం చేసి, ఆయా శాఖలకే భర్తీ బాధ్యతలు అప్పగించి, ప్రత్యేక భర్తీ కమిటీలు ఏర్పాటుచేసి.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పారదర్శకంగా నిర్వహించే ప్రతిపాద నలు న్నాయి. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీలో సాయిలు ఒకే ఒక్క సభ్యుడిగా ఉండగా, ఆయనకు యాక్టింగ్‌ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
మూడేళ్ళదాకా కొత్త ఉద్యోగాల్లేవ్‌
ప్రస్తుతం 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరత్వరగా పూర్తిచేసి మాట నిలుపుకోవాలని సర్కారు యోచిస్తోంది. రానున్న మూడేళ్ళు రిటైర్మెంట్లు ఉండవు కాబట్టి.. కొత్తగా ఏర్పడే ఖాళీలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా సగటున 6 వేల మంది ఉద్యోగులు పదవీవిరమణ చేస్తుండగా, ఉద్యోగులు అందరికీ మూడేళ్ళ పదవీవిరమణ వయసు పెంచిన నేపథ్యంలో.. మరో మూడేళ్ళదాకా మరో 18 నుండి 20వేల ఖాళీలు ఏర్పడవు. ఇది సర్కారుకు ఊరటనిచ్చే అంశం. ఈ 50వేల ఉద్యోగాలను భర్తీచేస్తే.. మళ్ళీ భర్తీకి అవకాశం ఉండదని, ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో 25లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వివిధ సంస్థలు, శాఖల ద్వారా 1.30లక్షల ఉద్యోగాలను గడచిన ఆరేళ్ళలో ప్రభు త్వం భర్తీచేసిందని, ప్రైవేట్‌ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిందని మం త్రులు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని ఒకేసారి చేపట్టి.. నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం కేసీ ఆర్‌ ఇందుకు సంబంధించి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్‌, ఉద్యోగ విరమణ వయసు పెంపు ద్వారా ఉద్యోగుల మనసు గెలిచిన ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ల ద్వారా నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement