హైదరాబాద్ : కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..గొల్ల, కురుమ సోదరులు నిరంతరం టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారని, టీఆర్ఎస్ గెలుపులో వారి పాత్ర మరువలేనిదన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ గొల్ల, కురుమల కోసం అమలు చేస్తున్నారన్నారు. యాదవులు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు తెలంగాణలో గొల్ల, కురుమలకు ఇచ్చామని పేర్కొన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కేశ వేణు, ప్రధాన కార్యదర్శి వొరక దేవన్న, సంఘం నాయుకులు పాల్గొన్నారు.